News

లండన్‌లో జాత్యహంకారుల వెర్రి చేష్టలు.. గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు

210views

లండన్‌లో జాత్యహంకారులు రెచ్చిపోయారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పిచ్చి రాతలు రాశారు. గాంధీ జయంతి వేడుకలకు ముందు ఇది చోటుచేసుకోవడం గమనార్హం.

లండన్‌లోని టావిస్టాక్‌ స్క్వేర్‌ వద్ద ధ్యానం చేస్తున్నట్లుగా మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. అక్టోబరు 2న గాంధీ జయంతి నేపథ్యంలో ఇక్కడ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి జాత్యహంకారులు గాంధీ విగ్రహంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది.

‘లండన్‌లోని టావిస్టాక్‌ స్క్వేర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన చర్య సిగ్గుచేటు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అహింసా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసం మాత్రమే కాదు. మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నాం’ అని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈసందర్భంగా విగ్రహ గౌరవం పునరుద్ధరణపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా.. ఈ ఘటనపై చర్యలు ప్రారంభించామని స్థానిక మెట్రోపాలిటన్‌ పోలీసులు పేర్కొన్నారు.