News

టిటిడి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఆలయాల నిర్మాణం

207views

రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలిలో నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 6 ఆలయాల వరకు నిర్మిస్తామని టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మతమార్పిడుల కట్టడికి శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మిస్తామన్నారు. ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపిన ఆయన.. తొలిసారిగా బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతున్నట్లు చెప్పారు.

‘‘ఈనెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 24 నుంచి అక్టోబరు 2 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల 24న మీనలగ్నంలో ధ్వజారోహణం, అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. పది రోజులపాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేయబోతున్నాం. ఈనెల 28న శ్రీవారి గరుడసేవకు 3 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నాం. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్‌ విధానం అమలు చేయబోతున్నాం’’ అని బీఆర్‌ నాయుడు తెలిపారు. అంతకుముందు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యులతో కలిపి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌-2025ని బీఆర్‌ నాయుడు విడుదల చేశారు.