News

చంద్రయాన్‌-3కి కేంద్రం ఆమోదం

614views

ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయని తెలిపిన శివన్‌ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు చంద్రయాన్-2 తరహాలోనే ఉంటుందని తెలిపారు. ”చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉండేవి. చంద్రయాన్‌-3లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన ల్యాండర్‌, రోవర్‌ ఉంటాయి” అని శివన్‌ వెల్లడించారు. గగన్‌యాన్‌, చంద్రయాన్‌-3 ప్రాజెక్టులతో కొత్త సంవత్సరం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుందన్నారు. 2019లో ఇస్రో అనేక విజయాలు సాధించిందని గుర్తుచేసుకున్నారు. 2019లో గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఎంతో పురోగతి సాధించామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురిని ఎంపిక చేశామని తెలిపారు. వారికి రష్యాలో ఈ నెల మూడోవారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. అలాగే గడిచిన ఏడాదిలో ప్రధానంగా ఇస్రో విస్తరణపై దృష్టిపెట్టామన్నారు. మరిన్ని మిషన్లు ఇస్రో సామర్థ్యాన్ని పెంచే దిశగా సాగుతున్నామన్నారు. ఈ క్రమంలో రెండో స్పేస్‌ పోర్ట్‌ నిమిత్తం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో భూసేకరణ చేశామని తెలిపారు.

చంద్రయాన్‌-2లో చోటుచేసుకున్న వైఫల్యంపైనా శివన్‌ వివరణ ఇచ్చారు. వేగాన్ని తగ్గించే వ్యవస్థ విఫలమవడం వల్లే ల్యాండర్‌ ఉపరితలాన్ని గట్టిగా ఢీకొట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా ల్యాండర్‌ జాడను కనుగొనడంలో సహాయపడిన చెన్నైకి చెందిన యువకుడు షణ్ముగ సుబ్రహ్మణియన్‌ను అభినందించారు.

చంద్రయాన్‌-3 ప్రాజెక్టును 2020లోనే చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ మంగళవారం వెల్లడించిన మరుసటి రోజే శివన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘చంద్రయాన్‌-2’ను విఫల ప్రాజెక్టుగా పరిగణించడం తగదని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమూ తొలి ప్రయత్నంలోనే జాబిల్లిపై ల్యాండర్‌ను దించలేకపోయిందని గుర్తుచేశారు. చంద్రయాన్‌-2తో సముపార్జించుకున్న అనుభవం, ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు మౌలిక వసతులు నూతన ప్రాజెక్టులో కీలకంగా మారుతాయని, చంద్రయాన్‌-2తో పోలిస్తే కొత్త ప్రాజెక్టు వ్యయం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.