News

మార్చి 5న నేపాల్‌ ఎన్నికలు

231views

కాఠ్‌మాండూ: నేపాల్‌ పార్లమెంటుకు తదుపరి ఎన్నికలు మార్చి 5న జరుగుతాయని ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ కార్యాలయం శనివారం ప్రకటించింది. నూతన ప్రధానిగా ప్రమాణం చేసిన జస్టిస్‌ సుశీలా కార్కీ సిఫార్సు మేరకు దేశ అధ్యక్షుడు పార్లమెంటును శుక్రవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. తక్కువ మంది సభ్యులతో ఆదివారం కార్కీ మంత్రిమండలి ఏర్పాటు చేస్తారని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. మరోవైపు ‘జెన్‌-జడ్‌’ యువతరం ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో శనివారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ తదితర నిషేధాజ్ఞలను ఎత్తివేశారు. ఈ అల్లర్లలో గాయపడి చికిత్స పొందుతున్న యువకులను ఆసుపత్రిలో కార్కీ పరామర్శించారు. నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సుశీలా కార్కీని ప్రధాని మోదీ అభినందించారు. నేపాల్‌లో శాంతి పునరుద్ధరణ, పురోగతితో పాటు అక్కడి ప్రజల శ్రేయస్సుకు భారత్‌ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.