News

వినూత్న ఆలోచన.. పర్యావరణ పరిరక్షణ

129views

పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. ప్రజల నుంచి వ్యర్థాలు సేకరించి… బదులుగా నిత్యావసర వస్తువులు అందించే ఏర్పాటు చేసింది. ప్రకృతిని కాపాడుకుంటూనే.. ప్రజలకు మేలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు పంచాయతీల్లో కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

  • ప్రస్తుతం వ్యర్థాలను రోడ్డు పక్కన, ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. స్వచ్ఛత సాధనలో సమస్యలు తప్పడం లేదు. స్వచ్ఛ రథాలే ప్రజల దగ్గర వెళ్లి వ్యర్థాలు సేకరించి, వాటికి రేటు కట్టి సమాన విలువైన నిత్యావసరాలు ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులు పట్టాలెక్కించారు.
  • విజయవాడ గ్రామీణ మండల పరిధిలోని రామవరప్పాడు, ప్రసాదంపాడు, నున్న పంచాయతీల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఆగస్టు 21 నుంచి ఆ మూడు పంచాయతీల్లో స్వచ్ఛ రథాలు తిరుగుతున్నాయి.
  • రోజుకు 500 కేజీల వరకు…

  • ఆ మూడు పంచాయతీల్లో ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రథాలు తిరుగుతాయి. రోజుకు మూడు పంచాయతీల్లో దాదాపు 500 కేజీల వ్యర్థాలు సేకరిస్తున్నారు. దాదాపు రూ.5 వేల విలువైన సరకులు ప్రజలకు అందిస్తున్నారు. స్వచ్ఛ రథాలను ముందు వైపు వ్యర్థాలు వేసేందుకు స్టోర్‌ రూమ్, వెనుక వైపు దుకాణం ఉండేలా రూపొందించారు.
  • ఓ వైపు పరిసరాలు, డ్రైనేజీలు, ఖాళీ స్థలాలు శుభ్రమవుతున్నాయి. ప్లాస్టిక్, ఇత్తడి, రాగి, ఇనుము వంటి వస్తువులు రీ సైక్లింగ్‌ కోసం తరలిస్తున్నారు. పథకం నిర్వహించడానికి అయ్యే ఖర్చు వస్తువులను కొంత లాభంతో అమ్మడం ద్వారా సమకూర్చుకుంటున్నారు. వ్యర్థాలు ఇచ్చిన ప్రజలకు సైతం నిత్యావసరాలు అందుతున్నాయి. అలా అందరికీ మేలు జరుగుతోంది.
  • ఆ మూడు పంచాయతీల్లో విజయవంతమైతే మండలానికి కొన్ని వాహనాలు కేటాయించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు.