ArticlesNews

పెద్దల ఆరాధనకు.. మహాలయ పక్షం

221views

మహాన్‌ అత్యంత కొలయో యత్రమహాలయ… అని పురాణోక్తి. మహాలయం అంటే ఘనమైన ముగింపు. భాద్రపద మాసంలోని కృష్ణ పక్షానికి మహాలయ పక్షం అని పేరు. ఈ సమయాన్ని పితృదేవతల ఆరాధనకు మన సంప్రదాయం నిర్దేశించింది. తర్పణాలు సమర్పించడం, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించే కాలమిది.

‘శ్రద్ధయా దీయతే శ్రాద్ధం’.. శ్రద్ధతో చేసే ప్రక్రియ శ్రాద్ధం. సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తుండే రోజుల్లో పితృదేవతలకు భక్తితో శ్రాద్ధ ప్రక్రియ నిర్వహించాలని స్కాంద పురాణంలోని నాగర ఖండం వివరించింది. అలా చేసినందువల్ల ప్రతిరోజూ గయాశ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుందని చతుర్వర్గ చింతామణి వివరించింది. దీనిని ‘దినేదినే గయా తుల్యం’ అంటారు. మహాలయ పక్షంలో అన్ని రోజులు కానీ, ఏ ఒక్క రోజైనా లేదా మహాలయ అమావాస్యనాడు పితృదేవతల ఆరాధన చేయడం వల్ల వారు ఒక సంవత్సరం వరకు సంతుష్టులవుతారని గరుడ పురాణం చెబుతోంది.

తప్పనిసరిగా తీర్చాల్సిన రుణాల్లో పితృరుణం ఒకటి. మహాలయ పక్షంలో వారసులు సమర్పించే తర్పణాలు వారికి సంతృప్తి కలిగించి, ఆశీర్వాదానికి కారణమవుతాయి. పితృదేవతల అనుగ్రహం వల్ల ఆయా కుటుంబ సభ్యులకు అన్ని విధాలా శ్రేయస్సు చేకూరుతుందని విశ్వసిస్తారు. వైరాజులు, అగ్నిశ్వాత్తులు, బర్విషధులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు, అంగీరసులు… అనేవి ఏడు పితృ గణాలు. మహాలయ విధి అనేది మూడు విధాలుగా ఉంటుంది. భౌతిక శరీరం మొదటిది. రెండోది ప్రేత శరీరం. మూడోది ఆత్మ శరీరం. దీనినే సూక్ష్మ శరీరం అంటారు. ఈ మూడింటికీ ప్రతీకలు మహాలయ సంకల్పంలో ప్రస్తావించే వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాలు. మహాలయ పక్షంలోని రోజులతో కలిపి పితృదేవతలకు సంవత్సరంలో ప్రియమైన రోజులు 96 ఉంటాయి. 14 మన్వాదులు, 16 మహాలయాలు, 4 ఉగాదులు, 12 సంక్రాంతులు, 12 అమావాస్యలు, 13 వ్యతీపాతలు, 13 వైధృతులు, 12 అన్వష్టకాలు. ఇవి మొత్తం 96 రోజులు. వీటినే షణ్నవతులు అంటారు. వీటిలో కనీసం ఒక్క మహాలయ అమావాస్య నాడైనా పితృకార్యం నిర్వహించాలని మన సంప్రదాయం చెబుతోంది.

శాంతి కోసం..
కన్యా, తులారాశుల్లో సూర్య గమనం ఉన్నప్పుడు ప్రేతపురి శూన్యంగా ఉంటుందంటారు. ఆ సమయంలో పితృదేవతలందరూ ఆహారాన్ని కోరుతూ తమ వారసుల గృహాల దగ్గర సంచరిస్తుంటారని మహాభారతం పేర్కొంది. మహాలయ పక్షాల్లో భాద్రపద అమావాస్య విశేషమైనది. పితృదేవతలకు శాంతిని కలిగించడం కోసం శ్రాద్ధం, తర్పణం, దానం అనే మూడు ప్రక్రియలను నాడు ఆచరించాలని చెబుతారు. పంచ మహా యజ్ఞాల్లో పితృ యజ్ఞం విశేషమైనది. తల్లిదండ్రులు తమ సంతానం కోసం చేసే త్యాగం వెలకట్టలేనిది. వారి త్యాగనిరతికి ప్రణమిల్లుతూ

శ్రాద్ధ కర్మను నిర్వహించాలి.
పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ భీకర యుద్ధం భాద్రపద బహుళపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులపాటు కొనసాగింది. యుద్ధంలో దేవతల బలం సన్నగిల్లగా, రాక్షసులు విజృంభించారు. ఆ యుద్ధంలో అనేకమంది మహర్షులు, యతులు మరణించారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతిమహాలయం, శాస్త్ర హత మహాలయం అనే పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్యనాడు దేవతలు పితృకార్యాలు నిర్వహించి, వారి అనుగ్రహంతో తిరిగి బలాన్ని పుంజుకొని రాక్షసగణాన్ని యుద్ధంలో ఓడించగలిగారని కథనం. అప్పటి నుంచి మహాలయపక్షంలోనూ, మహాలయ అమావాస్యనాడు పితృదేవతల ఆరాధన చేయడం సంప్రదాయంగా స్థిరపడిందంటారు.