News

బ్రిటిష్‌ మ్యూజియం నుంచి అస్సాంకు శంకరదేవ విృందావన వస్త్రం

62views

వైష్ణవ సాధువు శ్రీమంత శంకరదేవ మార్గదర్శకంలో 16వ శతాబ్దంలో పట్టుతో తయారుచేసిన ‘విృందావన వస్త్రం’ను ప్రదర్శించేందుకుగాను అస్సాంకు కొంతకాలం ఇచ్చేందుకు లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియం అంగీకరించింది. 18 నెలల పాటు ప్రదర్శించేందుకు అనుమతినిస్తూ, 2027లో ఈ వస్త్రాన్ని అస్సాంకు పంపడానికి కొన్ని షరతులతో బ్రిటిష్‌ మ్యూజియం అంగీకరించినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తెలిపారు. ‘‘పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఓ సంగ్రహాలయాన్ని ఏర్పాటుచేయగలిగితే విృందావన వస్త్రాన్ని కొంతకాలం ఇవ్వడానికి బ్రిటిష్‌ మ్యూజియం అంగీకరించింది. ప్రజల సందర్శనార్థం ఈ వస్త్రాన్ని తీసుకురావాలని మేం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాం. జేఎస్‌డబ్ల్యూ సంస్థలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఒక మ్యూజియంను ఏర్పాటుచేసి, దానిని అస్సాంకు బహుమతినిచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీనికోసం ఇప్పటికే భూమిని కూడా కేటాయించాం. చాలా కాలం తర్వాత అందరి ఆకాంక్ష తీరబోతోంది’’ అని శర్మ వ్యాఖ్యానించారు. కోచ్‌ రాజు నరనారాయణ కోరిక మేరకు కృష్ణుని జీవిత చరిత్రను వర్ణించేలా కొన్ని దృశ్యాలతో ఈ వస్త్రాన్ని రూపొందించారు. తొమ్మిదిన్నర మీటర్ల పొడవుండే దీనిని మొత్తం 15 వేర్వేరు భాగాలుగా తయారుచేసి, తర్వాత ఒకే వస్త్రంగా సమీకరించారు. 1904లో టిబెట్‌ నుంచి బ్రిటిష్‌ మ్యూజియం దీనిని కొనుగోలు చేసింది. విభిన్న కళాత్మకాలను కలిగి ఉన్న ఈ వస్త్రం అస్సాం చేనేత సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం.