
సనాతన ధర్మం, వాఙ్మయ పరిరక్షణ, పర రాష్ట్రంలో అమ్మభాష మనుగడకు తన వంతు సహకారం అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది తమిళనాడు రాజధాని చెన్నపురిలోని ‘వేద విజ్ఞాన వేదిక’.ఇద్దరు మిత్రుల(నోరి రామకృష్ణయ్య, సూరి రామకృష్ణ శాస్త్రి) మానస పుత్రిక. బాలారిష్టాలు అధిగమిస్తూ, మరో ఇద్దరి మిత్రుల చొరవతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తెలుగు భాష, సాహిత్యం, పురాణేతిహాసాల ప్రచారమే ప్రధానంగా, ప్రతిఫలాపేక్ష రహితంగా ఆ ఇద్దరి సౌజన్యంతో సాగుతూ సాహితీప్రియుల ప్రశంసలు అందుకుంటోది. ప్రతి నెల చివరి ఆదివారం సాయంత్రం అక్కడి తెలుగు సంగీత సాహిత్యప్రియులకు ఆటవిడుపు సమయం. నగరంలోని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్-ఆస్కా- (ఆంధ్రక్లబ్) ప్రాంగణం సాహితీ మధురిమలతో పులకిస్తుంది. ‘తరతరాల తెలుగు కవిత’ పేరిటి దశాబ్దంన్నరగా అందుతోన్న విజ్ఞాన వినోదాల విందు. సొంత నిధులతో ఆధ్యాత్మిక,సంగీత,సాహిత్య సేవకు సాగిస్తున్న సంస్థ సారథులు, అధ్యక్ష కార్యదర్శులు జేకే రెడ్డి, కందనూరు మధు.
ఎంత దూరం ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్న సూక్తికి మరో నిదర్శనం చెన్నైలోని ‘వేద విజ్ఞాన వేదిక’. బాలారిష్టాలను అధిగమించి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నగరానికి చెందిన ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు నోరి రామకృష్ణయ్య, సూరి రామకృష్ణ శాస్త్రి ఆలోచనతో పురుడు పోసుకుంది ఈ సంస్థ. ఆ ఇద్దరు మిత్రులు వెస్ట్ మాంబళంలోని కోవిలూరు మఠాలయం సందర్శించేవారు. అక్కడికి వచ్చే పండితులను ఆదరించాలనే భావన కలిగి, నూతన వస్త్రాలతో సత్కరించి ఆత్మసంతృప్తి చెందారు. అంతేకాదు…అలాంటి పండితులు, విద్వాంసులతో ధార్మిక ప్రవచనాలు, సాహిత్య ఉపన్యాసాలు ఇప్పిస్తూ, సంభావించుకోవాలనే భావన కలిగింది. దానివల్ల వేద,పురాణేతిహాసాలలోని మంచి విషయాలను నలుగురికి తెలియపరచడంతోపాటు నగరంలోని తెలుగువారు ఒకే చోట చేరే వీలుంటుందని తలచారు. వెంటనే కార్యాచరణకు పూనుకున్నారు. త్యాగరాయనగర్, విజయ రాఘవన్ వీధిలోని సూరి వారి నివాసంలో అవతరించింది ‘వేద విజ్ఞాన వేదిక’. నేటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మది తొలి ప్రసంగం. అలా ఆరు, ఏడు ప్రసంగాలు నిర్వహించారు. అయితే, అంతగా జనాదరణ లేకపోవడం, ఇతర కారణాలతో ప్రసంగాలు కొన్నేళ్లు నిలిచిపోయాయి. వయసు మీరిన తాము సంస్థను నిభాయించుకురావడం కష్టమని, సాహిత్యం పట్ల అభిరుచిగల మీరు కొనసాగించవచ్చు కదా?అన్న వారి అభ్యర్థన మేరకు ప్రస్తుత కార్యదర్శి కందనూరు మధు చొరవ చూపారు.అందుకు నగరంలోని వ్యాపార ప్రముఖుడు, ఆధ్మాత్మికవాది ముక్కు వెంకటేశ్ అండగా నిలిచారు. 2010 మార్చిలో సంస్థ పునరుద్ధరణ జరిగింది.
నన్నయ నుంచి వర్తమానం వరకు కవుల సాహితీసేవ, వివిధ సాహిత్య పక్రియలు, వాటి అంశాలను వివరించే అపురూప కార్యక్రమం ‘తరతరాల తెలుగు కవిత’. స్థానిక సాహితీ, విద్యావేత్తలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ రప్పించి ఉపన్యాసాలు ఇప్పించడం ప్రత్యేకత. నెలవారీ సాహితీ కార్యక్రమాలతో పాటు అన్నమయ్య, త్యాగరాజు తదితర వాగ్గేయకారుల ఆరాధనోత్సవాలలో ప్రత్యేక కార్యక్రమాలు. పుస్తకావిష్కరణలు.
రాజధాని కళాశాల (చెన్నై) తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులు దేవెళ్ల చిన్ని కృష్ణయ్య ‘ఆదికవి నన్నయ సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగంతో ఈ ధారావాహిక వెస్ట్ మాంబళంలోని మఠాలయంలో పునః ప్రారంభమైంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆడిటర్ జేకే రెడ్డి జత కూడారు. ఆయన, కందనూరు మధు అధ్యక్ష కార్యదర్శులుగా, మరో ముగ్గురు (భమిడిపాటి సుబ్రహ్మణ్యం, చిలుకూరి వేంకటేశ్వర్లు, పసుమర్తి బద్రీనాథ్) సభ్యులుగా ట్రస్టు నమోదైంది. కొంత•కాలానికి ఆ ముగ్గురు వృద్ధాప్యం, ఇతర కారణాలతో పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ప్రధాన సారథులుగా, వారి కుమారులు సభ్యులుగా ట్రస్ట్ నడుస్తోంది.
ప్రసంగాల నిర్వహణ వేదిక మఠం దూరంగా ఉండడంతో అందరికి అందుబాటులో ఉండేలా నగరం నడిబొడ్డున గల ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్-ఆస్కా- (ఆంధ్రక్లబ్)కు మార్చారు. సమావేశాల నిర్వహణలో ఆస్కా అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతగా ‘వేద విజ్ఞాన సంస్థ’ దానిని భాగస్వామిని చేసుకొని సంయుక్తంగా సుమారు పదేళ్ల పాటు ప్రసంగాలు నిర్వహించింది. కొత్త పాలకవర్గం భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకొంది. అయినా రుసుం చెల్లింపు ప్రాతిపదికన అక్కడి సమావేశ మందిరాల్లో (కృష్ణా, గోదావరి) ‘వేదిక’సాహిత్య సమావేశాలు కొనసాగుతున్నాయి.
‘ఓంకార జన్య శ్రీవాణీం గణేశాక్షర శోభినీం
చతుర్వేదమై వందే వేద విజ్ఞాన వేదికాం’ ప్రార్థనా శ్లోకంతో ప్రారంభమయ్యే సదస్సు గంటన్నరసేపు సాగుతుంది. కేవలం బోధన సంబంధిత వ్యక్తులతోనే కాక, వివిధ రంగాలకు చెందిన వారితోనూ ప్రసంగాలు ఏర్పాటవు తున్నాయి. ఉదా: ‘ప్రాచీన కావ్యసాహిత్యంలో ఆధునిక వైద్యాంశములు (వైద్యనిపుణులు ఏవీ దక్షిణామూర్తి). వివిధ సాహిత్య అంశాలపై వెలువడిన ప్రసంగాలను మచ్చుకు పరిశీలిస్తే….ఆదికవి నన్నయ (ఆచార్య దేవెళ్ల చిన్ని కృష్ణయ్య), సాహిత్యంలో సంశయావస్థ (పొన్నపల్లి శ్రీరామారావు), తెలుగు పద్య వైభవం (చేగొండి వీర వెంకట సత్యనారాయణ), తిక్కన కవితా శిల్పం (ఆచార్య వి. రామచంద్ర), నన్నచోడుడి కవితా రాజసం (డాక్టర్ ఎల్‌బీ శంకరరావు), రాయల కవితా ప్రాభవం (ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు),తెలుగు సాహిత్యం వ్యక్తిత్వ వికాసం (డా.గరికపాటి నరసింహారావు), సంగీత గేయధార (డా.వీబీ సాయికృష్ణ యాచేంద్ర), దాశరథి సినీ సాహిత్యం…జనరంజక వీణానాదం (ఆచార్య విస్తాలి శంకరరావు), గడియారం వేంకటశాస్త్రి సాహితీ వైభవం (నరాల రామారెడ్డి), అల్లసాని అల్లిక జిగిబిగి (దశరథ రామిరెడ్డి), ధూర్జటి కవితా మాధురీ మహిమ(వెన్నెలకంటి), వేద విజ్ఞానము-ఆధునిక సమాజం (డా.గోడా వేంకటేశ్వరశాస్త్రి), తిమ్మన• పారిజాతాపహరణం-మానసోల్లాస వ్యాఖ్యానం (గంధం బసవ శంకరరావు), సారంగు తమ్మయ్య కవి విరచిత వైజయంతీ విలాసము (డా.ఆకెళ్ల విభీషణ శర్మ), తెలుగు సాహిత్యంలో అలంకార ములు-స్వభావం, ప్రాధాన్యం (డా.రాణి సదాశివమూర్తి)ఎఱ్ఱన సాహిత్య వైభవం (డా.శలాక రఘునాథశర్మ), విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం-పద్యశిల్పం (డా.జోస్యుల కృష్ణభాబు) పానుగంటి వారి విశ్వరూపం-సాక్షి (రెంటాల శ్రీవేంకటేశ్వరరావు), మనసు కవి సినీజీవన ప్రస్థానం (ఎస్వీ రామారావు), గోదావరి-సంగీత సాహిత్య ఝరి (బాలాంత్రపు రామ్ నాథ్), జానపద భాషా వైభవం (డా.చిగిచెర్ల కృష్ణారెడ్డి), తెనాలి రామకృష్ణుని కవితా వైభవం (గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు), కూర్మనాథ కవి కవితా వైశిష్ట్యం (డా.పుట్టపర్తి నాగపద్మిని), పోతన భాగవతం-కావ్యశిల్పం (డా.గంగిశెట్టి లక్ష్మీనారాయణ) కురువంశ కులవధువులు-ధర్మస్వరూపిణులు (డా.ప్రభల జానకి), త్యాగరాజ కృతులు-సంగీత సాహిత్యవిశ్లేషణ (డా.రాణి నాగశ్రీ శైలేశ్వరి)
ఇంకా, సాహితీవేత్తలు ఆచార్య జీవీఎస్సార్ కృష్ణమూర్తి, బేతవోలు రామబ్రహ్మం, నండూరి పార్థసారథి, అప్పాజోస్యుల సత్యనారాయణ, వాడ్రేవు చినవీరభద్రుడు, పాపినేని శివశంకర్, భువనచంద్ర, శ్రీరమణ, కోట రాజశేఖర్, కొప్పర్తి రాంబాబు, స్వాతి శ్రీపాద, గిరిజాలక్ష్మి, ఘంటసాల రత్నకుమార్,సుద్దాల అశోక్‌తేజ, వేదగిరి రాంబాబు, ఉప్పలధడియం వెంకటేశ్వర, ఎస్‌ఏటీకే ఆచార్య, డాక్టర్ కాసల నాగభూషణం, పసుమర్తి బద్రీనాథ్, మోదుగల రవికృష్ణ, కోట రాజశేఖ, అవధానుల మణిబాబు, తదితరులు విలువైన ప్రసంగాలు చేశారు. క్రమం తప్పకుండా కొనసాగుతున్న ఈ ధారావాహికపై కోవిడ్ ప్రభావం పడింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ సమయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ వేదిక ధారావాహికకు కొంతకాలం విరామం ప్రకటించక తప్పలేదు. ఆ తరువాత నుంచి ప్రసంగాలు అలరిస్తూనే ఉన్నాయి.
సదస్సు నిర్వహణ ఇలా….
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్





