News

12 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఆర్జిత సేవలు రద్దు

142views

తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు 12 గంటల పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్‌ 7 న సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు చంద్ర గ్రహణం కారణంగా దాదాపు 12గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.

సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 8న సోమ‌వారం వేకువ‌జామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అధికారులు వివరించారు.

8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారని తెలిపారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుందని వివరించారు.

ఈ సందర్భంగా 7న ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందని , అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా మూసివేస్తామని వెల్లడించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 ల‌లో అన్నప్రసాదాల వితరణ ఉండదని పేర్కొన్నారు.

భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుంచి శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న వైభ‌వోత్సవ మండ‌పం, రామ్ భ‌గీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంట‌ర్లు, శ్రీ‌వారి సేవా స‌ద‌న్ వ‌ద్ద భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తామని వివరించారు.