
భారత ప్రతిపాదిత గగనతల రక్షణ వ్యవస్థ ‘సుదర్శన్ చక్ర’లో భాగంగా భారీ స్థాయిలో సెన్సర్లు, క్షిపణులు, నిఘా యంత్రాంగాలు, కృత్రిమ మేధ సాధనాలను అనుసంధానం చేయాల్సి ఉంటుందని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఈ వ్యవస్థ.. అటు కవచంలా.. ఇటు ఖడ్గంలా పనిచేస్తుందని చెప్పారు. అది ఇజ్రాయెల్‌కు చెందిన శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థ.. ఐరన్ డోమ్‌ను పోలి ఉంటుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని మహూలో జరిగిన ‘రణ్ సంవాద్’ సదస్సులో ఆయన మాట్లాడారు. మే నెలలో పాకిస్థాన్ ఉగ్రమూకలపై జరిపిన సైనిక చర్య ‘ఆపరేషన్ సిందూర్’ గురించి చౌహాన్ వివరించారు. ‘‘అది ఒక ఆధునిక ఘర్షణ. దాని నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాం. వాటిలో అనేకం అమలు దశలో ఉన్నాయి. కొన్ని ఇప్పటికే అమలయ్యాయి’’ అని తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సుదర్శన్ చక్ర ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని వివరాలను అనిల్ చౌహాన్ వెల్లడించారు. అది భారత ఐరన్ డోమ్ లేదా గోల్డెన్ డోమ్ అని పేర్కొన్నారు. దేశంలోని వ్యూహాత్మక, పౌర, జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను రక్షించడం దీని లక్ష్యమని వివరించారు. దీని కింద మౌలికవసతులు, శత్రు క్షిపణులు, యుద్ధవిమానాలను గుర్తించే, వాటిని నేలకూల్చే వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో క్షిపణులు, లేజర్ల ప్రయోగం ఉంటాయని తెలిపారు. క్షిపణి కవచంలో నిఘా వ్యవస్థలు, వివిధ ఆయుధాలు ఉంటాయని వివరించారు. ‘‘ఈ ప్రాజెక్టు కింద భూతల, గగనతల, సముద్ర, సాగరగర్భం, అంతరిక్షంలోని సెన్సర్లను అనుసంధానించాల్సి ఉంటుంది. బహుళ రంగాలతో నెట్‌వర్క్ సిద్ధం చేయాలి. అప్పటికప్పుడు ప్రతిస్పందించాలంటే భారీ స్థాయిలో డేటాను విశ్లేషించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో కృత్రిమ మేధ, అధునాతన కంప్యూటేషన్, డేటా ఎనలిటిక్స్, బిగ్ డేటా, క్వాంటమ్ టెక్నాలజీలను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. భారతీయులు దీన్ని తక్కువ ఖర్చుతో సాకారం చేస్తారన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు.





