News

పశువులను పూజించే పర్వదినం పోలాల అమావాస్య

222views

( ఆగస్టు 23 – పోలాల అమావాస్య )

గ్రామ దేవతలను, తమ జీవనాధారమైన వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం పోలాల అమావాస్య. శ్రావణ శుద్ధ బహుళ అమావాస్యనే ఈ పేరుతో పిలుస్తారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఆచరిస్తారు.

ఈ రోజున రైతులు ఎద్దులకు పూజ చేస్తారు, సాగు లేనివారు మట్టితో చేసిన ఎద్దు బొమ్మలను పూజిస్తారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ‘పోలాంబ’ అమ్మవారిని కొలుస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతోపాటు చీర సారెలు సమర్పిస్తారు. ఇలా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురిసి పంటలు పండుతాయని విశ్వసిస్తారు.

పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం పూజచేసే చోట అలికి, వరిపిండితో ముగ్గువేసి ఒక కందమొక్కను, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను ఉంచాలి. ముందుగా వినాయకుని పూజించి ఆ తర్వాత ఆ కందమొక్కలోకి మంగళగౌరీ దేవినిగానీ, సంతానలక్ష్మీ దేవినిగానీ ఆవాహన చేసి, షోడశోపచారాలు చేయాలి. తొమ్మిది పూర్ణం బూరెలు, తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన పులుసు అమ్మకు నైవేద్యంగా సమర్పించాలి. ఆపైన బహు సంతానవతి అయిన పెద్ద ముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవిక వస్త్రం పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూరెలు, ఒక తోరాన్ని, వాయనంగా ఇవ్వాలి. ఆశీర్వాదం తీసుకోవాలి. ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి వ్రతం ఆచరించిన వారు మెడలో కట్టుకోవాలి. మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే సంతానం పదికాలాలు పచ్చగా ఉంటారని నమ్మకం.