
నంద్యాలకు చెందిన ‘మనఊరు-మనగుడి-మనబాధ్యత’ సంస్థ వ్యవస్థాపకుడు శివకుమార్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది సేవకులు దేశంలోని వివిధ క్షేత్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అనుమతి తీసుకున్న వీరు..ఈ నెల 12వ తేదీ నుంచి 18 వరకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాలు, శిలాతోరణం, వేదపాఠశాల వంటి వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు.ప్రధానంగా ప్లాస్టిక్ తొలగింపుపై దృష్టిసారించి వారంరోజుల్లో 3 నుంచి 4 టన్నుల చెత్తను సేకరించి తొలగించారు.
ఈసందర్భంగా ఫౌండర్ శివకుమార్ మాట్లాడుతూ..తాను ఓ ప్రభుత్వ ఉద్యోగినని, కొంతకాలంగా వారణాశి, అరుణాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చెత్తను తొలగిస్తూ సేవ చేస్తున్నామన్నారు.ఇందులో భాగంగా తిరుమలలోనూ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాల వద్ద స్వచ్ఛతను సంరక్షించడమే లక్ష్యంగా ‘మనఊరు-మనగుడి-మన బాధ్యత’ సంస్థ పనిచేస్తుంది. దాదాపు 1,500 మంది సభ్యులతో ఇప్పటివరకు 200 ఆలయాల వద్ద సేవలు అందించాం. ఇటీవల తుంగభద్ర నదిలోని వ్యర్థాలు తొలగించాం. తిరుమలలో తితిదే డిప్యూటీ ఈవో ఆరోగ్యం సోమన్నారాయణ, సీపీఆర్వో రవి సహకారంతో 104 మంది సభ్యులతో వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించాం’ అని వివరించారు.





