
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలకమైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సెక్షన్, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 ప్రాజెక్టులను ఆదివారంనాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త రోడ్లు ప్రారంభంతో గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రూ.11,000 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టాను. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను దాదాపు 7,716 కోట్లతో చేపట్టారు. ఢిల్లీ శివారు ప్రాంతాలను కలుపుతూ 76 కిలోమీటర్లు అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుతో అనుసంధానం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానితో పాటు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎక్స్‌ప్రెస్‌వే పేరు ద్వారక అని, ఈ ఈవెంట్ జరుగుతున్నది రోహిణిలోనని, తాను కూడా ద్వారకాధీష్ గడ్డకు చెందిన వాడినని, అంతా కృష్ణమయంగానే కనిపిస్తోందని అన్నారు. ఆగస్టు మాసం ఫ్రీడం, రివల్యూషన్ రంగులతో కలర్‌ఫుల్‌గా ఉందన్నారు. ఈరోజు ఢిల్లీలో అభివృద్ధి రివల్యూషన్ కనిపిస్తోందన్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డు అనుసంధానమయ్యాయని చెప్పారు. ఢిల్లీ ఎన్‌సీఆర్, గురుగావ్ మొత్తానికి ఈ అనుసంధానం ఎంతగానే ఉపయోగపడుతుందన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి దేశ ఆర్థికవ్యవస్థ, స్వయం సమృద్ధి, దేశ ఆత్మస్థైరంపై తాను ఎంతో భరోసా వ్యక్తం చేశానని, యావత్ ప్రపంచం భారత్ వైపు చూసినప్పుడు వారి మొదటి చూపు ఢిల్లీపై పడుతుందని అన్నారు. అందువల్ల ఢిల్లీని మనం అభివృద్ధి మోడల్‌గా తీర్చిదిద్దాలని, అందరూ ముక్తకంఠంతో ‘ఇది అభివృద్ధి భారతదేశ రాజధాని’ అని నినదించాలని పేర్కొన్నారు.





