
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలన్న భక్తులకు వివిధ రూపాల్లో దళారులు ఎర వేస్తున్నారు. నిలువునా మోసగిస్తున్నారు. కొందరు యాత్రికులు తితిదే నిర్దేశించిన పద్ధతుల్లో కాకుండా స్నేహితులు, బంధువులను సంప్రదించడం, వారు తమకెప్పుడో తెలిసిన వారిని వీరికి పరిచయం చేయడం, సదరు వ్యక్తులు దళారులుగా మారి భక్తులను దోచుకోవడం.. నిత్యకృత్యమైంది. కేటుగాళ్లు తితిదే ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధుల పీఆర్వోలుగా నకిలీ ఐడీలు సృష్టించుకొని వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో లింకులు పంపిస్తున్నారు. దర్శనం, ఆర్జిత సేవలు, కాటేజీల బుకింగ్‌కు సంప్రదించాలంటూ సూచిస్తున్నారు. నమ్మించి భారీగా సొమ్ము లాగేస్తున్నారు. ఆనక ఫోన్‌కూ దొరక్కుండా తప్పించుకుంటున్నారు. కొందరు నకిలీ టికెట్లు సృష్టించి, అంటగడుతున్నారు. వాటిని నమ్ముకొని తిరుమలకు వచ్చిన భక్తులు క్యూలైన్‌లోకి వెళ్లాక తనిఖీల్లో దొరికిపోతున్నారు. అటు డబ్బులు పోయి, ఇటు స్వామివారి దర్శనం లభించక, పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
తిరుమల సమాచారాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసే వారికి బోలెడన్నీ వెబ్‌సైట్లు కన్పిస్తాయి. తితిదే అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ సైట్లు సృష్టించిన సైబర్ మోసగాళ్లు వీరికి వల విసురుతున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ఆధ్వర్యంలో ఇటీవల 30కి పైగా నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి, వాటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ నుంచి తొలగించారు. తిరుమలలోని ప్రధాన కాటేజీలు సప్తగిరి, ఎస్వీ, శంఖుమిట్ట, అన్నమయ్య గెస్ట్‌హౌస్‌ల పేర్లతో 32 ఫేక్ వెబ్‌సైట్లు ఉన్నట్లు గుర్తించి, 28 సైట్‌లను పూర్తిగా తొలగించారు. వీటిపై ఆయా వెబ్‌సైట్ డొమైన్స్ నిర్వాహకులకు లేఖలు రాశారు. వాటిలో గోడాడీ.కామ్, ఎల్‌ఎల్‌సీ, హోస్ట్‌ఇంజర్, హోస్ట్‌ఇంజర్ ఆపరేషన్స్, యూఏబీ, ఇన్2నెట్‌వర్క్ ఐఎన్‌సీ, ఓన్ వెబ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ వంటివి ఉన్నాయి. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బృందాలను నియమించారు. ఇక, తిరుమలలోని ప్రధాన కార్యాలయాలు, గదుల కేటాయింపు కేంద్రాల వద్ద దళారుల కార్యకలాపాలపై తితిదే విజిలెన్స్, పోలీసు విభాగాలు సంయుక్తంగా నిఘా పెట్టాయి. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలకు వచ్చే భక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి.
‘అధికారిక సైట్‌లోనే బుక్ చేసుకోవాలి’
స్వామివారి దర్శనం, సేవలు, వసతి గదుల కోసం తితిదే మూణ్నెల్ల ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు జారీచేస్తుంది. ఆఫ్‌లైన్‌లోనూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్‌ఎస్‌డీ, దివ్యదర్శన టోకెన్లు పొందొచ్చు. ఏ టికెట్ లేకపోయినా, నేరుగా సర్వదర్శనం క్యూలైన్‌లోకి ప్రవేశించవచ్చు. ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ https://www.tirumala.org ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇతర సైట్‌లకు వెళ్లొద్దు. గూగుల్‌లో ఏదైనా గెస్ట్‌హౌస్ పేరిట వెబ్‌సైట్ ఉందీ అంటే, అది నకిలీగా గుర్తించాలి. వాట్సప్ కాల్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపించి, పేమెంట్ చేయమంటే అంగీకరించొద్దు. దళారులను గుర్తిస్తే విజిలెన్స్ టోల్‌ఫ్రీ నంబర్ 18004254141, విజిలెన్స్ వింగ్ 0877-2263828కు, పోలీసు శాఖ డయల్ 100కు సమాచారమివ్వాలి. ఇప్పటికే మోసగాళ్లను గుర్తించి, జైళ్లకు పంపుతున్నాం.
-కేవీ మురళీకృష్ణ, సీవీఎస్‌వో, తితిదే





