
( ఆగష్టు 15 – కొండా వెంకటప్పయ్య వర్ధంతి )
మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్య్రయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. 1947 డిసెంబర్‌లో, ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత చారిత్రక ఘట్టంగా చెప్పే స్వేచ్ఛాభారతి ఆవిర్భావం తరువాత మూడు మాసాలకే గాంధీజీకి అందిన ఒక లేఖలోని వ్యథాభరిత వాక్యాలివి. గాంధీజీకి ఇలాంటి లేఖ ఒకటి అందిందని ‘మార్చ్’ అనే పత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో వార్తా కథనం కూడా ప్రచురించింది. ఆ వార్తకు శీర్షిక ‘కాంగ్రెస్ వర్స్ దేన్ ది బ్రిటిష్’. కాంగ్రెస్ పతానావస్థ గురించి అలా లేఖ రాసిన వారు శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు. అలాగని ఆయన ఏ హిందూ మహాసభ సభ్యుడో, కమ్యూనిస్టో అనుకుంటే పొరపాటే. ఆయన గాంధీ మార్గాన్ని తు.చ. తప్పకుండా అనుసరించిన నికరమైన గాంధేయవాది. ఉత్తర భారతంలో బాబూ రాజేంద్రప్రసాద్ వలె, దక్షిణాదిన రాజాజీ వలె, తెలుగు ప్రాంతాల నుంచి గాంధీజీకి విశ్వాసపాత్రులుగా ఖ్యాతి గాంచినవారు శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులుగారు.
కొండా వెంకటప్పయ్య 1866, ఫిబ్రవరి 22న పాత గుంటూరులో పుట్టారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. వారి ప్రాథమిక విద్య గుంటూరులోనే సాగింది. తరువాత బీఏ, బీఎల్ మద్రాసులో చేశారు. వెంకటప్పయ్యగారు మద్రాసులో బీఏ ‘జూనియర్’ చదువుతూ ఉండగానే, జాతీయ కాంగ్రెస్ పట్ల అభిమానం ఏర్పరుచుకున్నారు. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు చారిత్రాత్మకమైనవి. సహాయనిరాకరణ, శాసనోల్లంఘనల అనంతరం శాసనసభా ప్రవేశ వాదులకు, బహిష్కరణ వాదులకు మధ్య తీవ్ర చర్చలు జురుగుతున్న రోజులవి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు చిత్తరంజన్ దాస్ ఈ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. మధ్యే మార్గంగా వెంకటప్పయ్యని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ రోజుల్లో గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికీ కొండా వెంకటప్పయ్యే నాయకత్వం వహించేవారు. ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధానమైనది.
1933లో గాంధీజీ ఆంధ్రలో హరిజన యాత్ర సాగించారు. అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించారు. ఆంధ్రదేశంలో 65 వేల రూపాయలు హరిజన నిధి వసూలైంది. ఒక వంక భార్య పక్షవాతంతో బాధపడుతూ మృత్యుశయ్యపై ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో నిమగ్నుడై తిరుగుతున్నాడని మహాత్మాగాంధీ అన్నారు. 1929లో సైమన్ కమిషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యారు. భాషా ప్రాతిపదికన మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజించాలని కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఆరంభకుడిగా 1920 నుంచి 1949లో తాను కీర్తిశేషుడయ్యే వరకూ ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాజకీయాలలో ఆయన స్థానం దేశ రాజకీయలలో మదనమోహన మాలవ్యా స్థానం లాంటిది. కాంగ్రెస్ అగ్రనాయకులందరూ దేశ భక్త కొండా వెంకటప్పయ్యను గౌరవించేవారు.
శ్రీ కొండా వెంకటప్పయ్య కడలూరు జైలులో ఉన్నప్పుడు “డచ్ రిపబ్లిక్” అనే గ్రంథాన్ని రచించారు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా వ్రాశారు. “శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి” అన్న భక్తి రసభరిత శతకాన్ని, ఆధునిక ‘రాజ్యాంగ సంస్థలు’ అనే పుస్తకాన్ని రచించాడు. ‘ఏ వ్యక్తి జీవితమూ పూర్తిగా ఆనందంతోనూ ఉండదు. అలా అని పూర్తిగా విషాదంతోనే సాగదు’ అంటూ వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర ఆరంభమవుతుంది. ఆయన కళ్లెదుటే ఆయన కుమారులు ఇద్దరు కన్నుమూశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1949లో దేశమంతా ఆగస్టు 15 వేడుకలలో మునిగి ఉండగా, అదే రోజు కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య ప్రాణం అనంత స్వేచ్ఛావాయువులలో కలసిపోయింది. తెలుగువారందరూ సదా స్మరించుకోవాల్సిన నిరాడంబర సేవామూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య.





