
దేవాలయాల్లో భక్తులు విరాళంతో నిర్మించే కట్టడాలపై వ్యాపార ప్రకటనలు ఉంచడం సరికాదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన శ్రీవైభవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్థిక సహకారంతో సింహగిరిపై ఉత్తర గోపురం ఎదురుగా రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణం భూమి పూజలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో సింహగిరిపై వైకుంఠవాసుల మెట్ట సమీపంలో ఓ సంస్థ నెలకొల్పిన శంఖుచక్రాలు, తిరునామాల ఎల్‌ఈడీ విద్యుద్దీపాలంకరణపై ఆ సంస్థ వ్యాపార ప్రకటన ఏర్పాటు చేయడాన్ని గంటా తప్పుబట్టారు. గతంలోనే ధార్మిక సంస్థల ప్రతినిధులు, భక్తులు దీనిపై ఆవేదన వ్యక్తం చేశారన్నారు. తక్షణమే సంబంధిత సంస్థకు దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేసి లోగోను తొలగించాలని ఆదేశించారు. సంస్థ దానికి అంగీకరించకుంటే మొత్తం విద్యుత్తు దీపాలంకరణను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలోనే దేవాలయ పాలకమండలి నియామకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
సింహగిరిపై కొత్తగా సత్రాలు, అతిథి గృహాలను నిర్మించేందుకు సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. వైకుంఠవాసుల మెట్ట, శ్రీకృష్ణ దేవరాయల విజయ స్తూపానికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముందన్నారు. తొలుత అప్పన్న ఆలయ అర్చకులు భూమి పూజ నిర్వహించి పనులకు శంకుస్థాపన చేయించారు. అనంతరం ఎమ్మెల్యే గంటా, దాతలు స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో వేండ్ర త్రినాథరావు, 98వ వార్డు కార్పొరేటర్ పీవీ.నరసింహం, శ్రీవైభవి సంస్థ ప్రతినిధులు, తెదేపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




