
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కిన్నౌర్ జిల్లాలో భారీ వరదలు సంభవించడంతో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు. సహాయక చర్యల్లో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని.. వరదల ధాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా, కిన్నౌర్ కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం
హరిద్వార్‌లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది నీటిమట్టం పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజలు ఘాట్‌ల నుంచి దూరంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం.. ఇప్పటివరకు 130 మందికి పైగా ప్రజలను సహాయక బృందాలు రక్షించాయి. భారీ వరదలకు 4 జాతీయ రహదారులతో సహా 617 రోడ్లు ధ్వంసమైనట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ (SEOC) తెలిపింది. వీటిలో 377 రోడ్లు మండి జిల్లాలోనే ఉండగా.. మరో 90 రహదారులు కులు జిల్లాలో ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కొండచరియలు విరిగి పడుతుండడం వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.




