News

రామ్ మాధవ్ సహా పలువురి పేర్లు చెప్పాలని వారు నాపై ఒత్తిడి తెచ్చారు

247views

మాలేగావ్‌ పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన బిజెపి మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ . ఈ కేసు విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్ మోహన్‌ భాగవత్‌ పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

‘‘బిజెపి సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ సహా పలువురి పేర్లు చెప్పాలని వారు నాపై ఒత్తిడి తెచ్చారు. నన్ను హింసించారు. నన్ను ఆసుపత్రిలో అక్రమంగా నిర్బంధించారు. నేను గుజరాత్‌లో నివసించడం వల్ల ప్రధాని మోదీ పేరు కూడా చెప్పించాలని చూశారు. నేను అబద్ధాలు చెప్పాలని వారు ప్రయత్నించారు. అవి అబద్ధాలు కావడంతో నేను ఎవరి పేరు చెప్పలేదు’’ అని ప్రజ్ఞ మీడియాతో మాట్లాడారు. మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసు విచారణ బృందంలో ఉన్న మాజీ ఏటీఎస్ అధికారి మహబూబ్‌ ముజావ్‌ కూడా ఇలాంటి ఆరోపణలే చేసిన సంగతి తెలిసిందే.

ఆర్‌ఎస్ఎస్ సర్ సంఘచాలక్ను అరెస్టు చేయాలని అప్పట్లో తనకు ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న పరమ్‌బీర్‌ సింగ్‌తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు ఈ ఆదేశాలను తనకు ఇచ్చినట్లు చెప్పారు. తనకు సాయం చేసేందుకు రాష్ట్రం నుంచి దాదాపు పది మంది సిబ్బందితో పాటు రివాల్వర్‌ కూడా జారీ చేశారని ముజావ్‌ తెలిపారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించేందుకు నిరాకరించడంతో తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ఆ తర్వాత వాటన్నింటిలో తాను నిర్దోషిగా బయటకు వచ్చినట్లు వెల్లడించారు.

మహారాష్ట్రలోని మాలేగావ్‌ ప్రాంతంలో 2008 సెప్టెంబరు 29న పేలుడు సంభవించింది. ఓ మసీదు సమీపంలో మోటార్‌ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్‌, పురోహిత్‌తో పాటు రమేశ్‌ ఉపాధ్యాయ్‌, అజయ్‌ రహీర్‌కార్‌, సుధాకర్‌ ద్వివేది, సుధాకర్‌ చతుర్వేది, సమీర్‌ కులకర్ణి ప్రధాన నిందితులుగా కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది. ‘‘ఈ పేలుడుకు వినియోగించిన మోటార్‌బైక్‌.. మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ పేరు మీద రిజిస్టర్‌ అయిందని ప్రాసిక్యూషన్‌ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవు. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాల్లేవు’’ అని తీర్పు వెలువరించింది.