
( ఆగస్టు 4 – జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి )
జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో బాగా ప్రజాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో వినసొంపుగా ఉంటుంది. ఖండ కావ్యములు వీరి ప్రత్యేకత. కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి కరుణశ్రీ అని ప్రసిద్ధులయ్యారు. కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు పుష్ప విలాపము, కుంతి కుమారి అని చెప్పవచ్చు. ఈయన కవితాత్రయమైన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అత్యధిక ముద్రణలు కలిగి ఎనలేని ఖ్యాతి గాంచాయి. వీటిని ఆయన సున్నిత హృదయానికి, తర్కానికి ప్రతీకలుగా, ఆయన మెదడు, ఆయన విలువైన జీవితంగా అభివర్ణించవచ్చు. కరుణశ్రీగారి ప్రకారం ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ ఈ మూడు సత్యం, శివం, సుందరం యొక్క రూపాంతరాలు.
కరుణశ్రీగారి కవిత్వము పాఠకులని ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరళాలలోని దు:ఖాన్ని, వాటికి కారణాలను, పరిష్కార మార్గాలను కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పునకు, సమాజంలో శాంతి కొరకు, నైతిక విలువ అనే సంపద వృద్ధి కొరకు తన కవిత్వాన్ని వినియోగించారు. అందుకే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి. కుంతి కుమారి, పుష్పవిలాపం రెండు కావ్యాలలో కరుణ రసం తొణికిసలాడడం మనం గమనిస్తాం. ఈ కావ్యాల్లోని పద్యాలను ఘంటసాల వేంకటేశ్వరరావు ఆలపిస్తుండే సాహిత్యాభిమానులు మైమరచిపోయేవారు. తన్మయత్వం పొందని ఆంధ్రుడు లేడని గర్వంగా చెప్పవచ్చు. వీరి అనినాభావ సంబంధాన్ని పూవుకు తావిఅబ్బినట్లు అని చెప్పవచ్చు. ఆకాశమార్గాన అందనంత దూరాన విహరిస్తున్న తెలుగు పద్యాన్ని నేల మీదకు లాక్కొచ్చి ప్రతి పల్లెటూరిలో ప్రతి నోట పలికించిన ఘనత తిరుపతి వేంకట కవులది కాగా తెలుగు పద్యాన్ని హుమాయలా, రుబాయిలా పరువెత్తించిన నేర్పు జాషువాది. వారి తర్వాత అంతగాను, అంతకన్నా మిన్నగాను పద్యకవితను ప్రజల మధ్యకు చొచ్చుకుపోయేటట్టు చేసిన మహాకవి జంధ్యాల పాపయ్య శాస్త్రి.
కరుణశ్రీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో 1912 ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాద్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠములోనూ, గుంటూరులోని స్టాలు గర్ల్స్ హైస్కూలులో, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో 22 సంవత్సరాలు, హిందూ కళాశాలలో 2 సంవత్సరాలు ఆంధ్రోపన్యాసకులుగా వ్యవహరించారు. విద్యార్థినీ విద్యార్థులకు విశేషమైన సేవలు అందించారు.
కరుణశ్రీ కవితలో మరొక ప్రధానమైన పాయ దేశభక్తి. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవవీరులను, గాంధీ మహాత్ముడిని ఎన్నో కవితలలో చదువరుల హృదయాలను ఉప్పొంగించే ఆవేశంతో ఆయన గానం చేశారు. “రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయక ప్రజన్ దోచు పర ప్రభుత్వమును….” పద్యం చదివి ఒళ్లు గగుర్పొడవని పాఠకుడు ఉండడు. కరుణశ్రీ కేవలం పద్యకవి అనే అపోహ ఉంది. ఆయన చక్కని వచన కవిత్వం కూడా రాశారు. చైనా దురాక్రమణ సందర్భంగా, “చైనా చిట్టోడా, సిసింద్రీల జుట్టోడా, ఏనాటికైనా నువ్వెక్క లేవు మా గోడ, నల్లమందు తింటివా, చెడ్డ కలలు కంటివా అంటూ సాగే ఈ పాట ఆ రోజుల్లో బాగా పేలింది. దేశభక్తిని కలిగి ఉండడం, దేశాన్ని కన్నతల్లిగా భావించడం, తల్లి రుణం తీర్చుకోవడం వంటి భావనలు ఆయన భావకవిత్వంలో ప్రముఖంగా కనిపించే విషయాలు. అలాగే ప్రాచీనమైన మన సంస్కృతి పట్ల అభిమానాన్ని వ్యక్త పరచడం, కీర్తించడం కూడా కనిపిస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్న భారతావనిని చెరలో ఉన్న తల్లిగా భావించి ఆ చెరవిడిపించడం కర్తవ్యంగా భావించి ఉద్బోధ చేశారు ఆనాటి కవితాకుమారులు.
జయము జయము భరతావని
సకల భువన పావనీ
జయము జయము స్వేచ్ఛా ప్రియ
జనతా సంజీవని
అదిగదిగో చైతన్యరథం
కదలివచ్చే జనమనోరథం
పధ మంతా నవకాంతులు నిండుగ
భరతధాత్రి సుఖశాంతులు పండుగ
అందరి కొకటే న్యాయం అందరి కొకటే ధ్యేయం
సహజీవన సమైక్యతయే సమస్త విశ్వశ్రేయం
మా కభిమతమగు మతమ్ము మానవత్వ మొక్కటియే
మాకు బలమునిచ్చు కులము ఐక్యమత్య మొక్కటియే
దేశసేవ కంటే దేవతార్చన లేదు
స్వార్థపరత కంటే చావులేదు
సానుభూతికంటే స్వర్గంబు లేదురా
లలిత సుగుణజాల ! తెలుగు బాలా!!
ఇలా దైవభక్తి, దేశభక్తి, సమకాలీన రాజకీయ, సాంఘిక పరిస్థితులకు స్పందించి కరుణశ్రీ లేఖిని నుంచి పుంఖాను పుంఖంగా కవితలు వెలువడ్డాయి. తెలుగు పద్యాన్ని ఎంతో రమ్యంగా, సరళంగా, మధురంగా, శ్రవణసుభగంగా నడిపించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి సాహితీ ప్రియులను దు:ఖసాగరంలో ముంచి 1922 జూన్ 22న కన్నుమూశారు. కలం పేరే తన గుణమై, కవితలలోని ప్రధాన రసమై పఠితల గుండెల్లో నిండిన సుధాలహరియై దశాబ్దాల పాటు నిలిపి ఉంచడం కరుణశ్రీకి మాత్రమే సాధ్యమైంది.





