
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల ముసుగులో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. దీంతో ఆస్సాంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో శాంతికి సోషల్‌మీడియా వేదికలు భంగం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. లఖింపూర్, ధిమాజీ, తిన్సుకియా, డిబ్రుగఢ్, చారాడియో, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్, కామ్‌రూప్ (మెట్రో), కామ్‌రూప్ జిల్లాల్లో సేవలను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో పలు చోట్ల ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ దళాలు కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. మరోవైపు గువాహటిలో కర్ఫ్యూ విధించారు.
బెంగాల్లో…
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పశ్చిమ బెంగాల్‌కు సైతం తాకిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మాల్దా, ముర్షీదాబాద్, హౌవ్‌డా, నార్త్ 24 పరగణా, సౌత్ 24 పరగణా జిల్లాల్లో ఈ సేవలను నిలిపివేసినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎప్పటి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నదీ అధికారులు చెప్పలేదు. ముర్షీదాబాద్‌లో ఐదు ఖాళీ రైళ్లకు నిప్పు పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోనూ అరాచకం…
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలోని ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడి జామియానగర్‌లో పలువురు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై కావాలనే పోలీసులు లాఠీఛార్జి చేశారని ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నాయకుడొకరు ఆరోపించారు. బాష్పవాయువు ప్రయోగించారని తెలిపారు. మరోవైపు ఈ హింసతో తమకు సంబంధం లేదని, స్థానికులే ఇందులో పాల్గొన్నారని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థి సంఘం ప్రకటించింది. దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన మూడు బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆ మంటలను అదుపులోకి తెచ్చేందుకు వెళుతున్న మరో అగ్నిమాపక వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారని, ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అటుగా వెళుతున్న వాహనాలను దారి మళ్లించారు.
ఇది విద్రోహ శక్తుల వికృత క్రీడ
కాగా ఈ హింసాత్మక ఘటనల వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆమ్ ఆద్మీ నాయకులున్నారని భాజపా ఆరోపిస్తోంది. భారతీయులకు ఏ ఇబ్బందీ లేని ఈ చట్టంపై ప్రతిపక్షాలు తమ గ్రుడ్డి వ్యతిరేకత, ఆందోళనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని భాజపా విమర్శిస్తోంది. దానికి తగినట్లుగానే నిన్న ఢిల్లీలో జరిగిన ఆందోళనలలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఒకరిని టీవీ ఛానల్ ప్రతినిధి ఒకరు “ మీరు ఎందుకు ఆందోళన నిర్వహిస్తున్నారు?” అని అడిగినప్పుడు ఆ వ్యక్తి సరిగా సమాధానం ఇవ్వలేకపొయ్యారు. దీనిని బట్టి ఈ ఆందోళనల వెనుక రాజకీయ కారణాలు తప్ప మరే కారణాలు లేవని, ఈ ఆందోళనలన్నీ ప్రతిపక్షాల వికృత క్రీడలో భాగమని జాతీయ వాదులు పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





