
ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 3 వ భాగం ఇక్కడ చదవండి
ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 2 వ భాగం భాగం ఇక్కడ చదవండి
ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం భాగం ఇక్కడ చదవండి
జస్పేర్ రాజ్‌తో కనిమొళి కుమ్మక్కు
తమిళ్ మయం అనే ఎన్‌జీవోను నడుపుతున్న రెవరెండ్ జస్పేర్ రాజ్ నేర చరిత్ర మామూలుగా లేదు. ఒకప్పుడు అటు శ్రీలంకలోనూ, ఇటు భారత్‌లోను వేర్పాటువాదానికి, హింసాత్మక ఘటనలకు కారణమైన లిబరేషన్ తమిళ్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్`ఎల్‌టీటీఈకి ఆయుధాల ఏజెంట్‌గా రెవరెండ్ జస్పేర్ రాజ్ ఉన్నాడు. ఆయుధాలను అక్రమంగా రవాణా చేసేవాడు. రాజ్‌ను తమకు అప్పగించాలని అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ భారత్‌ను కోరిందని పేర్కొంటూ డాక్టర్ సుబ్రమణియన్ స్వామి సెప్టెంబర్ 9, 2013న ట్వీట్ చేశారు. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ ఆ ట్వీట్‌ను తన వ్యాసంలో ప్రస్తావించారు.
కనిమొళి అతడితో కలిసి చెన్నయ్ సంగమమ్ పేరిట ఒక జానపద సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్‌టీటీఈతో ఉభయులకు గల సంబంధాలను బహిర్గతం చేసిన ఆ కార్యక్రమం తీవ్రమైన విమర్శలను ఎదుర్కోంది. ఇదిలా ఉండగా కీళడిలో పురాతన వస్తువులు వెలుగులోకి రావడం మొదలుకావడంతోనే ఆ విషయం వారిద్దరికీ తెలిసింది. సెప్టెంబర్ 24, 2016న కీళడిలో తవ్వకాలకు నేతృత్వం వహించిన అమర్‌నాథ్ రామకృష్ణ రాజ్‌ను, కనిమొళిని వెంటపెట్టుకొని మరీ తవ్వకాలు జరుగుతున్న చోటుకు తీసుకొని వెళ్లారు. వారిద్దరిని కందకాల్లో తిప్పారు. అణువణువు చూపించారు. అప్పుడే తమిళనాడులో వెలుగులోకి వచ్చిన హిందూ నాగరికత మూలాలతో కూడిన తమిళనాడు నాగరికతను నామరూపాల్లేకుండా చేసే ఓ కుట్రపూరితమైన కార్యక్రమం పురుడు పోసుకుంది.
ఇప్పటివరకు నాగరికతకు సంబంధించి ఉత్తర, దక్షిణ భారతాలు అనే పేరుతో జరుగుతున్న వేర్పాటు వాద కుట్ర కొత్త రూపాన్ని దాల్చింది. ఆర్య నాగరికత, ద్రవిడ నాగరికత అనే ద్వంద్వ కపటోపాయానికి కాలం చెల్లింది. మన నాగరికతకు మనుగడ లేకుండా చేస్తున్న దుష్ట శక్తులు తవ్వకాల్లో బైటపడిన పురాతన వస్తువులు సాకుగా చూపి పాశ్చాత్య నాగరికతను మరీ ముఖ్యంగా క్రైస్తవ నాగరికతను భారతీయుల మీదకు రుద్దే దారుణమైన కార్యక్రమానికి కీళడిని వేదికగా చేసుకోవడం గమనార్హం.
దేశంలో పురావస్తు పరిశోధనల కోసం తొలిసారి తవ్వకాలు నిర్వహించిన వారు బ్రిటిష్ పురావస్తు నిపుణుడు జాన్ మార్షల్ (1920). హరప్పా, మొహెంజదారోలలో సింధు నాగరికత ఆనవాళ్లు ఆనాడే బయటపడినాయి. మోర్టీమ్ వీలర్, కన్నింగ్ హామ్ తరువాత తోడ్పడ్డారు. వారు ఆంగ్లేయులే అయినా సింధు నాగరికతను సిలువెక్కించలేదు. ఆ పని ఇప్పుడు జరుగుతోంది. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారంటూ అంతకు ముందే జర్మన్ జాతి మూలాలున్న మ్యాక్స్ ముల్లర్ వంటి కుహనా పండితుల వాదనలను ఆ తవ్వకాలలోకి చొప్పించ లేదు కూడా. జాత్యహంకార మ్యాక్స్ ముల్లర్ మధ్య ఆసియా నుంచి ‘ఆర్య’ విషవాయువును సృష్టించే ప్రయత్నం చేస్తే, జాతివ్యతిరేక ద్రవిడ పిడివాదులు దక్షిణ భారతం నుంచి భారతీయ వ్యతిరేక విషపు గాలిని దేశం మీదకు వీచేటట్టు చేయాలని చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.
సశేషం





