
ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించే సాంఘిక శాస్త్రంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ మార్పులు చేసింది. భారతదేశాన్ని 13 నుంచి 17వ శతాబ్దంవరకు పాలించిన ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, మొఘల్ చక్రవర్తులు, మరాఠాలు, సిక్కు రాజుల చరిత్రలకు సంబంధించి, గతంలో చేర్చని పలు అంశాలను కొత్త పాఠ్యాంశంలో భాగం చేసింది.
ఈ పుస్తకంలో మొగల్ చక్రవర్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్బర్ పాలనను క్రూరత్వం, సహనాల మేళవింపుగా అభివర్ణించిన ఈ పాఠ్యపుస్తకం.. బాబర్‌ను విజయం కోసం నిర్దాక్షిణ్యంగా పోరాడిన వ్యక్తిగా, ఔరంగజేబును సైనిక పరిపాలకునిగా పేర్కొంది. ‘‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ, ఇండియా అండ్ బియాండ్’’ అనే శీర్షికతో ఇదే వారంలో విడుదల చేసిన ఈ పుస్తకం విద్యార్థులకు దిల్లీ సుల్తానుల పాలనను, మొగలాయిలు, మరాఠాలు, బ్రిటిషర్ల పాలనను పరిచయం చేస్తోంది. సున్నితమైన హింసాత్మక ఘటనల్ని, యుద్ధాన్ని, రక్తపాతాన్ని గురించి సమాచారాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుందని పుస్తక ప్రారంభంలో ఒక సూచన చేశారు. గతంలో జరిగిన ఘటనలకు ఈనాడు ఎవరినీ బాధ్యుల్ని చేయరాదని సూచించారు. చిత్తోర్‌గఢ్ కోటను జయించాక అక్బర్ చక్రవర్తి 30 వేల మంది సామాన్యుల్ని చంపాలని ఆదేశించినట్టు పుస్తకం పేర్కొంది. ముస్లిమేతరులపై విధించిన ‘జిజియా’’ పన్నును ప్రస్తావించింది. ఛత్రపతి శివాజీ, తారాబాయ్, అహల్యాబాయి హోల్కర్ వంటి పాలకులను దార్శనికత కలిగిన నాయకులుగా ప్రస్తుతించింది. ఈ పుస్తకంలో మొగలాయిలను ధూర్తులుగా చిత్రీకరించే ప్రయత్నం జరగలేదని ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యక్రమ విభాగ అధిపతి మైకేల్ డ్యానిమో చెప్పారు.
అలాగే.. ‘చరిత్రలో కొన్ని చీకటి ఘట్టాలు’ అనే పేరిట రాసిన ఉపోద్ఘాతంలో ఎందుకు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాన్ని సవరించాల్సి వచ్చిందో వివరించింది. శ్రీరంగం, చిదంబరం సహా పలు హిందూ ధార్మిక స్థలాలను అల్లావుద్దీన్ ఖిల్జీ దళవాయి మాలిక్ కఫూర్ నాశనం చేశాడని ఎన్‌సీఈఆర్టీ పుస్తకంలో వివరించింది.





