కరసేవకులు ప్రయాణిస్తున్న రైలు బోగీలకు నిప్పటించడం ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రే – నానావతి కమీషన్

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ లభించింది. 2002 గుజరాత్‌లోని గోద్రా అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి కమిషన్ నివేదికలో మోడీ నేతృత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన పాలనలో ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్ల ఘటన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలకు అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల విఫలం కావడమే కారణమని తెలిపింది. వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించింది. మోడీ సీఎంగా ఉన్న సమయంలోనే నానావతి కమిషన్‌ను ఏర్పాటుచేయగా ఐదేళ్ల క్రితం సమర్పించిన ఈ నివేదికను గుజరాత్ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. ఈ అల్లర్లను మంత్రులు ప్రేరేపించారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని నివేదిక స్పష్టంచేసింది. మొత్తం 1500 పేజీలతో తొమ్మిది సంచికలుగా ఈ నివేదిక రూపొందించారు. గుజరాత్‌లోని పలు ప్రదేశాల్లో పోలీసుల నిస్సహాయతకు కారణం తగిన సంఖ్యలో పోలీసులు లేకపోవడం, వారి వద్ద ఆయుధాలు కొరవడటమేనని కమిషన్ నివేదిక తెలిపింది.
జస్టిస్ నానావతి
2002లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోద్రాలో సబర్మతి రైలులోని రెండు బోగీలకు కొందరు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది కరసేవకులు సజీవ దహనమైన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. రైలు దహనం ఘటన తర్వాత గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లలో దాదాపు 1000 మందికి పైగా మృతిచెందారు. గుజరాత్‌లో చెలరేగిన హింసోన్మాదంలో పోలీసులు నిస్సహాయంగా ఉండిపోయారనీ వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నివేదికలో సూచించింది. గోద్రాలో రైలు బోగీల దహనానికి సంబంధించి 2008లో సమర్పించిన ప్రాథమిక నివేదికలో హిందూ కరసేవకులు ప్రయాణిస్తున్న రైలు బోగీలకు నిప్పటించడం ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రేనని నివేదిక స్పష్టంచేసింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.