News

మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం

271views

జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ‘ధర్మ చక్రవర్తి’ బిరుదును శనివారంనాడు ప్రదానం చేశారు. ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్‌కు ఏడాది పొడవునా నిర్వహించే జాతీయ నివాళికి నాంది పలుకుతూ ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జైన నేత ఆధ్యాత్మిక, పండిత వారసత్వాన్ని స్మరించుకునేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఢిల్లీలోని భగవాన్ మహావీర్ అహింసా భారత్ ట్రస్టు సహకారంతో ఈ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ధర్మ చక్రవరి బిరుదును ప్రధాని స్వీకరిస్తూ, తనను తాను ఈ బిరుదుకు అర్హుడనని భావించడం లేదని, అయితే సాధువుల నుంచి ఏది స్వీకరించినా దానిని ప్రసాదంగా స్వీకరించాలనేది మన సంస్కృతి అని చెప్పారు. ఈ ప్రసాదాన్ని తాను వినయంగా స్వీకరిస్తూ తల్లి భారతికి అంకితమిస్తున్నానని అన్నారు.

ఆచార్య విద్యానంద్ జీ 1987 జూన్ 28న ‘ఆచార్య’ బిరుదును అందుకున్నారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇది కేవలం గౌరవం కాదని, జైన సంస్కృతిని సంయమనం, కరుణతో అనుసంధానించే పవిత్ర ధార అని అన్నారు. క్రమశిక్షణ, సన్యాసి జీవితాన్ని గుర్తుచేసే వేడుకలు ఇవని పేర్కొంటూ ఆచార్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ స్మారక పోస్టల్ స్టాంపును ప్రధానమంత్రి మోదీ, కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విడుదల చేశారు. దీనికి ముందు ‘లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మోదీ, షెకావత్ సందర్శించారు. ఆచార్య ఆధ్యాత్మిక ప్రయాణంలోని కీలక ఘట్టాలను గుర్తు చేసే కుడ్యచిత్రాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.