News

విక్రమ్‌ జాడను మేం ఎప్పుడో గుర్తించాం – ఇస్రో శివన్

709views

చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో గల్లంతైన చంద్రయాన్‌-2లోని -విక్రమ్‌’ ల్యాండర్‌ను ఎట్టకేలకు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం వెల్లడించింది. అయితే నాసా ప్రకటనను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధినేత కె. శివన్‌ తోసిపుచ్చారు. విక్రమ్ ఆచూకీ కనుగొన్నది నాసా కాదని, దాని జాడను తాము ఎప్పుడో గుర్తించామని అన్నారు. నాసా ప్రకటనపై స్పందించిన శివన్‌.. ‘మా సొంత ఆర్బిటర్‌ విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించింది. ఈ విషయాన్ని మేం ఇప్పటికే ఇస్రో వెబ్‌సైట్లో వెల్లడించాం. కావాలంటే మీరు కూడా చూడొచ్చు’ అని చెప్పారు.

విక్రమ్‌ ల్యాండర్ ఆచూకీ దొరికినట్లు నాసా మంగళవారం ప్రకటించింది. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొనడంతో అది విచ్ఛిన్నమైందని వెల్లడించింది. చెన్నైకు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ సాయంతో ల్యాండర్‌ను గుర్తించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది.

అయితే చంద్రయాన్‌-2 ప్రయోగం జరిగిన మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 10న విక్రమ్‌ గురించి ఇస్రో తమ వెబ్‌సైట్‌లో ఇలా పేర్కొంది. ‘చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించింది. అయితే, దానితో ఇంకా కమ్యూనికేషన్‌ జరగలేదు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని తెలిపింది. అందుకే నాసా కంటే ముందే విక్రమ్‌ ల్యాండర్‌ను తాము గుర్తించామని శివన్‌ చెబుతున్నారు. అయితే, విక్రమ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్నది మాత్రం ఇస్రో స్పష్టంగా చెప్పలేదు.

తాజాగా విడుదల చేసిన నాసా చిత్రాల్లో ల్యాండర్‌ పూర్తిగా విచ్ఛిన్నమైనట్లు కన్పించింది. సెప్టెంబరు 7న విక్రమ్‌ హార్డ్‌ ల్యాండ్‌ అయిన ప్రాంతానికి సుమారు 750 మీటర్ల దూరంలో ఈ శిథిలాలను గుర్తించారు. విక్రమ్‌ భూ కేంద్రంతో సంబంధాలు కోల్పోయిన తర్వాత నాసా దాని కోసం తీవ్రంగా గాలించింది. ఈ క్రమంలో కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఈ ఫొటోలను ల్యాండింగ్‌కు ముందు తీసిన చిత్రాలతో పోల్చిన షణ్ముగ సుబ్రమణియన్‌ ల్యాండింగ్‌ తర్వాతి చిత్రాల్లో ఒక చిన్న చుక్కను కనుగొన్నారు. ఆ విషయాన్ని నాసాకు తెలియజేయగా విక్రమ్‌ శకలాలు బయటపడ్డాయి.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.