
కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల అభయారణ్యం ప్రాంతంలో ఏడు నదులు కలిసే సప్త నదుల సంగమేశ్వర క్షేత్ర శిఖరాన్ని కృష్ణా జలాలు తాకాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాలకు వరద ఎక్కువ కావడంతో జూరాల 10 గేట్లు ఎత్తి నీటిని దిగువ శ్రీశైలానికి వదిలారు. ది.
జలాశయం 862 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా నదీగర్భంలో కలిసిపోనుంది. సంగమేశ్వర క్షేత్రం శిఖర భాగానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే సోమవారం ఆలయం పూర్తిగా జలాధివాసం కానుంది. ప్రతి ఏడాది 8 నెలలు నదీ గర్భంలో, 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చే చారిత్రక నేపథ్యం ఉన్న, పాండవులు వనవాసం చేసిన ప్రాంతం, ప్రాచీన ఆలయం నేడు కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోనుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన భక్తులు, పర్యాటకులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ శిఖరం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.





