News

విత్తన బంతులతో పచ్చదనం

229views

పచ్చని వనాలను పెంచడానికి విత్తన బంతులు ఒక అద్భుతమైన మార్గమని పర్యావరణ సంరక్షణ గతివిధి సంస్థ విశాఖ పర్యావరణ సంయోజక్‌ డా.ఎస్పీబీ రంగాచార్యులు అన్నారు. సీతమ్మధార కొండపైన ఆదివారం పర్యావరణ సంరక్షణ గతివిధి, వనమాలి, సీటీజీ, ప్లాంట్‌ ఎ హోప్‌, జేడీ ఫౌండేషన్‌, రోటరీ, ఐఐఏఎం, వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సొసైటీ, గ్రీన్‌ క్లైమేట్‌ టీం వంటి స్వచ్ఛంద సంస్థలు కలిసి విత్తన బంతులు విసిరే కార్యక్రమాన్ని చేపట్టాయి.

ఈ సందర్భంగా డా.రంగాచార్యులు మాట్లాడుతూ వాతావరణ మార్పులను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనం తిన్న పండ్ల విత్తనాలను సేకరించి, ఆరబెట్టి, ఆ తర్వాత పేడ, మట్టి, బూడిదతో కలిపి విత్తన బంతులుగా తయారుచేయాలని సూచించారు. వర్షాకాలంలో ఈ విత్తన బంతులను కొండలు, నదీతీరాలు, సముద్రతీర ప్రాంతాలు, చెరువు గట్లపై చల్లడం ద్వారా పచ్చదనాన్ని పెంచవచ్చని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయకపోతే భవిష్యత్‌ తరాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సమాజ సేవకులు పాల్గొన్నారు.