News

సముద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులో కూచిపూడి నృత్యం..

244views

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. సముద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉన్న తుంగనాథ్ ఆలయం వద్ద మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూచిపూడి నృత్యం చేసి ఈ రికార్డు సాధించారు. 2024లో కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో నృత్య ప్రదర్శన చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించామని చిన్నారులు తెలిపారు. చిన్నారులతో కైలాస పర్వతంపై మరో నృత్య ప్రదర్శన ఇప్పించడమే తమ తదుపరి లక్ష్యమని కూచిపూడి గురువులు ప్రవీణ్, వందన చెప్పారు.

”మా వందన డాన్స్​ అకాడమీని 2017లో జులై 21వ తేదీన ప్రారంభించాం. ఇన్ని సంవత్సరాలలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చాము. కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రదర్శనల్లో -2 డిగ్రీల ఉష్ణోగ్రతలు 25 కిలోమీటర్లు, 21 గంటల పాటు కాలినడకతో వెళ్లి చిన్నారులు చేసి కూచిపూడి నృత్య ప్రదర్శనకు 2024లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. నృత్య కళాకారులను జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సర్టిఫికెట్లను అందజేసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరింత మెరుగ్గా ప్రదర్శనలు చేయాలని మా అకాడమీ విద్యార్థులను ప్రోత్సహించారు. కైలాస పర్వతం ముందర నృత్య ప్రదర్శన చేయాలన్నదే మా లక్ష్యం”– వందన,ప్రవీణ్,వందన డాన్స్​ అకాడమీ గురువులు

”తుంగనాథ్‌లో -3 డిగ్రీల సెల్సియస్‌ నృత్యం చేయడం వలన మాకు ఇంటర్నేషన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ రావడం ఎంతో సంతోషంగా ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రదర్శనల్లో -2 డిగ్రీల ఉష్ణోగ్రతలు 25 కిలోమీటర్లు, 21 గంటల పాటు కాలినడకతో వెళ్లి మేము నృత్యం చేశాం. అందుకుగాను మాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ , బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలిస్తాం”– వందన డాన్స్​ అకాడమీ విద్యార్థులు