News

ఇది యుద్ధ కాలం కాదు..చర్చలతోనే పరిష్కరాలు: మోదీ

226views

భారత్‌, సైప్రస్‌కు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశంలో పర్యటిస్తున్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సైప్రస్‌కు యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్ష పదవి అవకాశం రావడంపై శుభాకాంక్షలు తెలిపారు. సైప్రస్‌ నాయకత్వంలో ఈయూతో మరింత మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం సైప్రస్‌, యూరోపియన్‌ యూనియన్‌ మద్దతు సాధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇది యుద్ధాల కాలం కాదు!
సైప్రస్‌ అధ్యక్షుడిని భారత్‌ పర్యటనకు ఆహ్వానిస్తున్నట్లు మోదీ చెప్పారు. వీలైనంత త్వరగా భారత్‌కు రావాలని కోరుకుంటున్నామని అన్నారు. సైప్రస్‌ నాయకత్వంలో భారత్‌, మధ్యప్రాచ్యం, ఈయూ మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయని భారత్‌ ఆశిస్తోందని పేర్కొన్నారు. ఇది యుద్ధాల కాలం కాదు, చర్చలతోనే పరిష్కారాలు లభిస్తాయమని ఉద్ఘాటించారు.

గౌరవంగా భావిస్తున్నా!
సైప్రస్‌, భారత్‌ రెండు కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. దేశాల మధ్య సుహృద్భావ చర్చలు జరిగినప్పుడే శాంతి వికసిస్తుందని మోదీ అన్నారు. సైప్రస్‌ అత్యున్నత పురస్కారం తనకు ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం తొలగిపోవాలని భారత్‌, సైప్రస్‌లు ఆకాంక్షిస్తున్నాయని వెల్లడించారు.

మరోవైపు, భారత్‌ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ అన్నారు. గత 11 సంవత్సరాలలో భారత్‌లో వేగవంతమైన ఆర్థిక పరివర్తన వచ్చినట్టు చెప్పారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటంలో సైప్రస్ మద్దతుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. సైప్రస్ కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సైప్రస్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌తో జరిగిన సమావేశంలో మోదీ వ్యాఖ్యానించారు.

అంతకుముందు, నికోసియాలోని అధ్యక్ష భవనంలోకి సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. సైప్రస్ దళాలు రెండు దేశాల జెండాలను ప్రదర్శించాయి. ప్రధాని మోదీకి గౌరవ వందనం చేశాయి. సైప్రస్ అధ్యక్ష భవనంలో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ, నికోస్ చర్చించారు. అనంతరం సైప్రస్‌లో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్‌-3ని మోదీకి నికోస్ ప్రదానం చేశారు.