News

తిరుమల ఎస్వీ మ్యూజియం – ఆధ్యాత్మిక సంపదకు ఆధునిక హంగులు

188views

ఓ దేశం గొప్పతనం, ఓ జాతి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం కళలను చాటి చెప్పడంలో పురావస్తు ప్రదర్శనశాలలు (మ్యూజియం) కీలక భూమిక పోషిస్తాయి. వీటిద్వారా ఆయా ప్రాంతాల చారిత్రక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయవచ్చు.

ఈ కోవలోనే తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియంను ఆధునికీకరిస్తున్నారు. టీసీఎస్‌ రూ.125 కోట్లు, మ్యాప్‌ సంస్థ రూ.20 కోట్లు కలిపి రూ.145 కోట్ల విరాళాలతో కొత్త హంగులు కల్పిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక 3డీ, 7డీ సాంకేతికత ఉపయోగిస్తున్నారు. జీ ప్లస్‌ 3 అంతస్తుల్లోని 19 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా తీర్చిదిద్దుతున్నారు.

ఏ అంతస్తులో ఏముంటాయంటే : ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియం భవనం కింది అంతస్తులో తిరువీధులు, తిరుమల ఆలయ అనుభూతి, వాహన స్వామివారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఉంటాయి. వీటిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన మ్యాప్‌ సిస్టమ్స్‌ సంస్థ, మిగతా వాటిని టీసీఎస్‌ ఆధునికీకరిస్తున్నాయి. వీటితో పాటు కాంస్య, దారు విగ్రహాలు, పురాతన నాణేలు, అన్నమయ్య కీర్తనల రాగిరేకుల గ్యాలరీలు ఉంటాయి.

మొదటి అంతస్తులో శ్రీవారి ఆలయ శిల్పకళా వైభవం, యుద్ధపరికరాలు, భక్తాగ్రేసరులు-వారి సేవలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి గ్యాలరీలు కొలువుదీరనున్నాయి.

రెండో అంతస్తులో విరాట్‌ పురుషుడు, రుగ్వేదం, బ్రహ్మ మహేశ్వరులు, యజుర్వేదం గ్యాలరీలు ఉంటాయి.

మూడో అంతస్తులో బ్రహ్మాండ గ్యాలరీలు, భవనం పైభాగంలో 17 గోపురాలు ఉంటాయి. వీటిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, తాళ్లపాక అన్నమయ్య, పురందరదాస, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి భక్తాగ్రేసరులతో పాటు మహాభారతం, రామాయణం, భగవద్గీతల్లోని ముఖ్య ఘట్టాల ప్రదర్శనలు ఉంటాయి.

ఆగస్టు నాటికి పూర్తి చేయాలి : ఆధునికీకరణ పనుల్లో కీలక భాగస్వామి, దాత అయిన టీసీఎస్‌ సంస్థ మ్యూజియం అంతర్గత పనులను ఇప్పటికే పూర్తి చేసింది. భవనం బయట పనులకు మ్యాప్స్‌ సిస్టమ్స్‌ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిని ఆగస్టు నెల నాటికి పూర్తి చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ మ్యూజియం నిర్వహణకు టీటీడీ టెండర్లు ఆహ్వానిస్తోంది. వీలు అయినంత త్వరగా మూజియంను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఎస్వీ మ్యూజియం ఇన్‌ఛార్జి సోమన్నారాయణ తెలిపారు.