News

ఇజ్రాయెల్‌లో భారతీయులందరూ సురక్షితమే – భారత ఎంబసీ

179views

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడున్న మన పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం మరోసారి స్పందించింది. ఇక్కడ భారతీయులందరూ సురక్షితమేనని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. భారత పౌరుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. వారికి అవసరమైన సాయం అందించేందుకు 24 గంటల హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయడంతోపాటు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

‘‘ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయ కుటుంబాలు, సంరక్షకులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులతో టెల్‌ అవీవ్‌లోని రాయబార కార్యాలయం టచ్‌లోనే ఉంది. ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు స్థానిక అధికారులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. ఇక్కడి ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇక్కడ గగనతలం మూసివేశారు. భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. అనవసర ప్రయాణాలు చేయవద్దు. స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రమాణాలు పాటించాలి’’ అని టెల్‌ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా ప్రకటన జారీ చేసింది.