
దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపట్టనున్న జనగణనపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి జనగణనతో పాటే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. దేశ 16వ జన గణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం రెండు దశల్లో జరగనున్న జనగణన 2027 మార్చి 1 నాటికి పూర్తి అవుతుందని నోటిఫికేషన్లో పేర్కొంది. జనగణనతో పాటు కుల గణననూ కూడా అదే సమయానికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటల కల్లా జన గణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఏప్రిల్‌లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్ధాఖ్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 2026 సెప్టెంబరు ఆఖరు నాటికే జన గణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబరు 1ని రెఫరెన్స్ తేదీగా ప్రకటించింది.
జన గణన కోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్‌వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటు కూడా ఉంది. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది.
జనాభా లెక్కల సన్నాహాలను సమీక్షించేందుకు జూన్ 15న దిల్లీలో జరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. అందులో కేంద్ర హోం కార్యదర్శి, రిజిస్ట్రార్ జనరల్, భారత్ జనాభా లెక్కల కమిషన్(ఆర్జీ, సీసీఐ), ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జూన్ 16న జనగణన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల అవుతుందని ఆ సమావేశంలో అప్పుడే చెప్పారు. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది.





