News

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. ఇస్రో కీలక ప్రకటన

236views

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది. జూన్‌ 19వ తేదీన శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. యాక్సియం-4 మిషన్‌ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన నింగిలోకి వెళ్లనున్నారు. అయితే, తొలుత మే 29న ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలతో పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది.

ఇదిలా ఉండగా.. అంతకుముందు శుభాంశు శుక్లా రోదసియాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్‌ఎక్స్‌ తెలిపింది. రాకెట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ‘ఎక్స్‌’లో పేర్కొంది. మరమ్మతులకు సమయం పడుతుందని.. త్వరలోనే కొత్త లాంచ్‌ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రయోగ వాయిదా విషయాన్ని భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ధ్రువీకరించింది. ప్రయోగానికి ముందు బూస్టర్‌ టెస్టును తనిఖీ చేస్తుండగా ఈ సమస్యను గుర్తించినట్లు తెలిపింది. తొలుత లీక్‌ సమస్యను పరిష్కరించి పరీక్షించిన తర్వాత ప్రయోగం నిర్వహించాలని శాస్త్రవేత్తలు తేల్చారు.

అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్‌ నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్‌ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌ బాధ్యతలు నిర్వహిస్తారు.