
కొవిడ్, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో గతంలో భారత్, చైనా విమాన సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి కొంతకాలంగా ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈనేపథ్యంలో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. చైనా విదేశాంగశాఖ ఉప మంత్రి సన్ వీడాంగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపటంపై చర్చలు జరిగాయని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా అందిస్తున్న సహకారాన్ని కూడా మిస్రీ అభినందించారు.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ ఉప మంత్రి సన్ వీడాంగ్‌తో సమావేశంలో భాగంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి పునర్ నిర్మించడానికి చర్చలు జరిపినట్లు మిస్రీ వెల్లడించారు. ఇరువురి మధ్య నిర్మాణాత్మకంగా, సానుకూల వాతావరణంలో సాగిన ఈ చర్చల్లో వాస్తవాధీనరేఖ దగ్గర నెలకొన్న పరిస్థితిని సమగ్రంగా సమీక్షించామన్నారు. ప్రత్యక్ష విమాన సర్వీసులను పునఃప్రారంభించడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. అదనంగా, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, మీడియా, పరిశోధనా సంస్థల మధ్య మార్పిడిని ప్రోత్సహించడం వంటి విషయాల్లో కలిసి పనిచేయడం పైనా సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా వాణిజ్య, ఆర్థిక రంగాల్లో భారత్-చైనాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొవిడ్ 19 మొదలైనప్పటినుంచి భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల లద్దాఖ్ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం విషయంలో రెండు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో ఇరుదేశాలకు నేరుగా విమాన సర్వీసుల అంశం కూడా ఒకటి. ఈ ఒప్పందాలపై చర్చించడానికి భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ జనవరిలో చైనాను సందర్శించారు. ఇరుదేశాల మధ్య విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు.





