
ఒడిశాలోని భద్రక్ ప్రాంతంలో దారుణం జరిగింది. అక్రమ పశువుల రవాణాను చేసే ఇస్లామిక్ ఛాందసులు సంతోష్ పరిడా అనే వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన గత నెల 30 తేదీన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం తిహిడి పంచాయతీ పరిధిలోని కాష్టి గ్రామం నుంచి గుజిదర్దా అనే గ్రామానికి కొందరు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికులు నివారించి, వారిని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా… ఘర్షణకు దారి తీసింది.
ఘర్షణ జరిగిన కాసేపటికే సమీప గ్రామాల నుంచి వంద మందితో కూడిన ఛాందసుల గుంపు సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ సమయంలో సంతోష్ పరిదా జోక్యం చేసుకొని, మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాడు. కానీ.. ఆ గుంపు వినిపించుకోకుండా సంతోష్ పరిదాపై కర్రలతో తీవ్రంగా దాడికి దిగారు.దీంతో పరిదా తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో ఆయన్ను భద్రక్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటన తర్వాత మరణించిన సంతోష్ భార్య మినతీ పరిఢా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు.
తీవ్రంగా స్పందించిన విశ్వహిందూ పరిషత్
ఆవుల అక్రమ రవాణాచేసే ఇస్లామిక్ ఛాందసుల చేతిలో మరణించిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని VHP డిమాండ్ చేసింది. వారు చేసిన హింసాత్మక చర్య వల్లే సంతోష్ మరణించారని ఆరోపించింది. వందలాది మంది వచ్చి, నానా బీభత్సం చేస్తే.. పోలీసులు కేవలం 12 మందిని మాత్రమే అరెస్ట్ చేశారని వీహెచ్ పీ నేతలు మండిపడ్డారు. జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.





