
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో పర్యాటకం ఒక్కసారి స్తంభించిపోయింది. అప్పటికే విహారయాత్రలకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. దీని ప్రభావం త్వరలో ప్రారంభం కానున్న ప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్రపైనా పడుతుందని అంతా భావించారు. అయితే, అనుమానాలను పటాపంచలు చేస్తూ.. భారీ సంఖ్యలో యాత్రికులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. జమ్ముకశ్మీర్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 3.31 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రకోసం పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అమర్‌నాథ్ గుహకు చేరుకోవాలంటే 45 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాలి. దీనికి పహల్గాం ఓ బేస్ క్యాంప్‌గా ఉపయోగపడుతుంది. అక్కడికి చేరుకున్న యాత్రికులు కొద్దిసేపు సేదతీరి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తారు. అదే ప్రాంతంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరగడంతో యాత్రికుల సంఖ్య తగ్గుతుందని అధికారులు భావించారు. అయితే, ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు, స్థానికంగా భద్రత పెంపుతో అమర్‌నాథ్ యాత్రకు పెద్ద సంఖ్యలో స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జులై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. గతేడాది 52 రోజుల పాటు యాత్ర జరగ్గా.. ఈ సంవత్సరం మాత్రం కేవలం 38 రోజుల్లోనే ముగియనుంది. పహల్గాం, బాల్‌తాల్ మార్గాల్లో యాత్రికులను అనుమతించనున్నారు. దాదాపు 5 లక్షల మందికిపై భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారని శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డు-ఎస్‌ఏఎస్‌బీ అంచనావేస్తోంది. అమర్‌నాథ్ గుహలో సహజంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకోవడాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. దీనిని దర్శిస్తే సాక్షాత్తు పరమశివుడిని దర్శించుకున్నట్లేనని నమ్ముతారు.





