News

ముస్లిం మతపెద్ద ముసుగులో పశువాంఛ

246views

అతనొక మతపెద్ద. వారి మతస్థులకు మంచీ చెడు చెప్పాలి. అయితే ఆ పెద్ద మనిషి ఓ బాలిక పట్ల కర్కశంగా ప్రవర్తించి కాటేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. లోకం తీరు తెలియని ఆ అమాయకురాలు కడుపులో బిడ్డను మోస్తోంది. ఈ అమానవీయ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన యాభై ఏళ్ల మహమ్మద్‌ ఫయాజ్‌ స్థానికంగా మసీదుల్లో మతపెద్దగా చలామణి అవుతున్నాడు. ఇతడికి సంతానం లేదు. బావమరిది కుమార్తెను పెంచుకుంటున్నాడు. ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకోవడానికి బంధువుల అమ్మాయిని (13 ఏళ్ల వయసు) రెండేళ్ల క్రితం తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి చదువుకోలేదు. అభం శుభం తెలియని అభాగ్యురాలిపై ఆ దుర్మార్గుడి కన్ను పడింది.

కామ కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూసేవాడు. భార్య ఇంట్లో లేనపుడు బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరకు తీసుకుని పలుమార్లు శారీరకంగా అనుభవించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. ఇటీవల కడుపునొప్పి రావడంతో తల్లికి ఫోన్‌లో చెప్పింది. నగరానికి వచ్చిన బాధితురాలి తల్లి.. బాలికను రెండు రోజుల క్రితం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలిక ఆరునెలల గర్భవతి అని తేల్చారు. వారి సూచనతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడంతో అసలు విషయం బయటకు పొక్కింది. పోలీసులకు విషయం తెలియడంతో బాధితురాలిని ఓ హోంలో ఉంచారు. ఆమె నుంచి స్టేట్‌మెంట్‌.. రికార్డు చేశారు. కాగా నిందితుడు సంపన్నుడు కావడం, వారి మతంలో పలుకుబడి ఉండటంతో విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.