
331views
హనుమాన్ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో గురువారం రాత్రి నిర్వహించిన శోభాయాత్ర పట్టణ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. స్ధానిక హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోగా, పట్టణంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో శాసనసభ్యులు మాల కొండయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద హనుమాన్ శోభాయాత్రను గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. హనుమాన్ భారీ విగ్రహంతో పాటు, దేవతమూర్తుల ఉత్సవ విగ్రహాలతో పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. జై హనుమాన్ అంటూ పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రజలందరికీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నట్లుగా ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు.





