
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు.
నక్సలిజం నిర్మూలనలో ఇదో మైలురాయి: అమిత్ షా
‘‘నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో 27మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మూడు దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి. భద్రతా దళాలకు అభినందనలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 54మంది నక్సలైట్లు అరెస్టు అయ్యారు. 84మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది’’ అని అమిత్ షా ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే మరికొంత మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిచెందాడు. 1955లో శ్రీకాకుళం జిల్లా జీఅన్న పేటలో కేశవరావు జన్మించారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా పనిచేశారు. 1980లో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన తర్వాత స్వగ్రామాన్ని వదిలి నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు నంబాల.1980లో ఏర్పడిన సీపీఐ పీపుల్స్ వార్ గ్రూప్‌లో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నారు.
1987లో అంబుష్ వ్యూహాలు, పేలుడు పదార్థాల వినియోగంపై శిక్షిణ పొందారు. 2004లో సీపీఐ పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన మావోయిస్టు పార్టీకి కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ 10న ముప్పల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి రాజీనామా చేసిన తర్వాత నంబాల కేశవ్ రావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు, పేలుడు పదార్థాల వినియోగంలో నంబాల నిపుణుడు. నంబాలపై ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. భద్రతా దళాలపై జరిగిన పలు ప్రధాన మావోయిస్టు దాడుల్లో నంబాల పాత్ర కీలకం. నంబాల కేశవరావుపై ఒక కోటి రివార్డు కూడా ఉంది. నంబాల భార్య కూడా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నారు.





