
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో బుధవారం కూడా విచారణ కొనసాగుతోంది. వక్ఫ్ అనేది ప్రాథమిక హక్కు కాదు.. చారిటీ మాత్రమేని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తమ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో ఇవాళ కూడా సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి.
వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం కూడా విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ ధర్మాసనం.. వక్ఫ్ (సవరణ) చట్టం–2025 అమలుకు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నా అందుకు తగిన ప్రాతిపదిక తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
పార్లమెంటు చేసే చట్టాలు రాజ్యాంగబద్ధమేనన్నది సాధారణ భావన. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేసేందుకు ప్రభుత్వానికి అధికారం, రాష్ట్ర, కేంద్ర వక్ఫ్ బోర్డుల కూర్పు, వివాదాస్పద ఆస్తులను కలెక్టర్ విచారణ సమయంలో వక్ఫ్‌గా పరిగణించబోమన్న నిబంధనపై మధ్యంతర ఉపశమనం కావాలంటే ఆ మేరకు గట్టి ప్రాతిపదిక తప్పనిసరని సీజేఐ పేర్కొన్నారు. ఆ మూడు అంశాలపైనే వాదనలు వింటామని గత విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేయడం తెలిసిందే.
దాంతో వాటి అమలు దిశగా ప్రస్తుతానికి ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ఆ సందర్భంగా కోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. చట్టం అమలుకు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వొద్దని అభ్యర్థించింది. వక్ఫ్ భావనలోనే లౌకికత్వం ఇమిడి ఉందని సమర్పించిన నోట్‌లో కేంద్రం పేర్కొంది. ‘‘వక్ఫ్ చట్టం జాతీయ అవసరం. మత స్వేచ్ఛకు భంగం కలగని రీతిలో వక్ఫ్‌కు సంబంధించిన పలు లౌకికపరమైన అంశాల మెరుగైన నిర్వహణే దాని ఉద్దేశం’’ అని పేర్కొంది. దానితో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి విభేదించగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘స్పష్టమైన సందర్భం వెల్లడవనప్పుడు ఉపశమనం ఇవ్వలేం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదు. మేం ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు’’ అన్నారు.
గతంలో ధర్మాసనం పేర్కొన్న మూడు అంశాలకే విచారణను పరిమితం చేయాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దాన్ని సిబల్, సింఘ్వి తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘వివాదాస్పద చట్టంలోని కొన్ని అంశాలకే విచారణను పరిమితం చేయజాలం. ఢిల్లీ జామా మసీదు వంటి రక్షిత కట్టడాలు కూడా ప్రస్తుతం వక్ఫ్ ఆస్తులుగా ఉన్నాయి.
కొత్త చట్టం ప్రకారం వాటి వక్ఫ్ హోదా రద్దవుతుంది. పైగా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చొప్పించేందుకు వీలు కల్పించారు’’ అని వాదించారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల సంఖ్య రెండుకు పరిమితం కదా అని సీజేఐ ప్రశ్నించగా, అది కూడా ఎక్కువేనని సిబల్ అన్నారు. పార్లమెంటు చట్టాలపై కోర్టులు సాధారణంగా స్టే ఇవ్వరాదన్న కేంద్రం వాదనపై సింఘ్వి అభ్యంతరం వెలిబుచ్చారు. సాగు చట్టాలపై సుప్రీంకోర్టు గతంలో స్టే ఇచ్చిందని గుర్తు చేశారు.