
పాకిస్తాన్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడానికి దృఢమైన నిర్ణయం తీసుకుని దాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు భారతదేశాన్ని జఫర్ సహితో అభినందించారు. ఆయన జియే సింధ్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ (జెఎస్ఎఫ్ఎం) అధ్యక్షుడు. పాకిస్తాన్ నుంచి సింధ్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న ఉద్యమం అది. భారత్‌ను అభినందించే ప్రకటనతో పాటు ఆయన ఒక బహిరంగ లేఖ రాసారు. దాని శీర్షిక ‘ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యం పాకిస్తాన్ నుంచి సింధీల హక్కులు, స్వీయ నిర్ణయాత్మకత కోసం అంతర్జాతీయ సమాజానికి వినతి’. అందులో జెఎస్ఎఫ్ఎం తమ దేశాన్ని అస్థిరపరిచే విధానాల విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది.
ఉగ్రవాదానికి ప్రతిగా భారత్ నిర్ణయాత్మక దాడి:
ఉగ్రవాద బృందాలకు ఆశ్రయమిచ్చి, వారికి అండగా నిలిచిన పాకిస్తాన్ మిలటరీ బేస్‌లు, ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి భారతదేశం అత్యంత ఆధునిక సాంకేతికతను, కచ్చితమైన నిఘా సమాచారాన్నీఉపయోగించడాన్ని జఫర్ సహితో ప్రశంసించారు. ‘‘ఎంతో ధైర్యంగా, ప్రభావశీలంగా చేసిన దాడులు భారతదేశపు బలాన్ని, నిర్ణయాత్మకతను, తన పౌరులను రక్షించుకుంటూ ఉగ్రవాదులను శిక్షించడంలో భారత్ చూపిన నిబద్ధతనూ తెలియజేసాయి’’ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను చావుదెబ్బ తీసింది, ఫలితంగా పాకిస్తాన్ ప్రపంచ దేశాలు – ముఖ్యంగా అమెరికా – ఒత్తిడితో, కాల్పులను నిలిపివేసి, చర్చలు జరపడానికి అంగీకరించింది.
ఆపరేషన్ సిందూర్ వల్ల ప్రాదేశిక భద్రతలో కలిగే విస్తృతస్థాయి పరిణామాలను వివరిస్తూ… ‘‘అమాయకులను చంపేవారు, వారి యజమానులు, వారికి ఆశ్రయం కల్పించేవారు, వారికి నిధులు సమకూర్చే వారూ ఆ చర్యలకు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భారత్ చర్యలు స్పష్టమైన సందేశాన్నిచ్చాయి’’ అని సహితో స్పష్టం చేసారు.
జెఎస్ఎఫ్ఎం ప్రకటన, ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి భారతదేశపు నాయకత్వం అవసరాన్ని వివరించింది. పాకిస్తానీ పంజాబ్ ఆధిక్యం కలిగిన సైనిక పాలనలో సుదీర్ఘకాలంగా కష్టనష్టాల పాలవుతున్న సింధీ జాతి ఆ అంశానికి బాగా కనెక్ట్ అయింది.
సింధీల సంఘీభావం – చారిత్రక సందర్భం:
చారిత్రక సింధీ జాతీయులుగా తాము ఎదుర్కొన్న ఘర్షణలకూ, ఉగ్రవాదంపై భారత్ పోరుకూ సామ్యాలు చూసిన జెఎస్ఎఫ్ఎం, భారతదేశానికి సంఘీభావం ప్రకటించింది. ‘‘పాకిస్తాన్ మిలటరీ పాలనలో మేము కూడా చాలాకాలం కష్టాల పాలయ్యాం. ఆ పాలనలో పంజాబ్ ఆధిక్యం ఎక్కువ. రాడికల్ ఇస్లామిక్ శక్తులు, చైనా వంటి బాహ్య శక్తుల కలయిక మరింత ప్రమాదకరమైనది’’ అని సహితో చెప్పారు.
పాకిస్తాన్‌లో సైనిక పరిపాలనలో బలోచ్, పష్తూన్, సరైకీ వంటి తెగలతో పాటు సింధీయులు కూడా వ్యవస్థీకృత అణచివేత, దోపిడీ, హింసాకాండల బాధితులుగా నిలిచారు.
జెఎస్ఎఫ్ఎం రాసిన లేఖ, చరిత్రాత్మకమైన ‘సప్త సింధు’ ప్రాంతం అంతటినీ పాకిస్తాన్ ఆక్రమించేసిందంటూ తమ భూమి తమకే కావాలన్న వాదనను తెర మీదకు మరోసారి తెచ్చింది. సింధీ, బలోచ్, పష్తూన్, సరైకీ తెగల సాంస్కృతిక, చారిత్రక సేవలను గుర్తు చేసింది. ‘‘సింధీ, బలోచ్, పష్తూన్, సరైకీ తెగల ప్రజల నేపథ్యాలనూ, వారు దేశానికి అందించిన సేవలనూ విస్మరించజాలము’’ అని స్పష్టం చేసింది. స్వీయ నిర్ణయాత్మకతకు తమకున్న హక్కును గుర్తించాలని కోరింది.
అంతర్జాతీయ సమాజానికి అత్యవసర వినతులు:
ప్రపంచ శక్తులకు, అంతర్జాతీయ సంస్థలకు జెఎస్ఎఫ్ఎం పలు వినతులు చేసింది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలనీ, అణచివేయబడిన తమ జాతుల స్వీయ నిర్ణయాధికారానికి మద్దతివ్వాలనీ కోరింది. వారి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి….
(1) అమెరికా దాని మిత్రపక్షాలకు: ‘‘పాకిస్తాన్ దగ్గరున్న అణ్వాయుధాలను శాశ్వతంగా నిర్వీర్యం చేయాలి. ఉగ్రవాదాన్ని ప్రచారం చేసే మిలటరీ రాజ్యం చేతుల్లో అలాంటి అణ్వాయుధాలు ఉండడం ప్రాదేశిక, ప్రపంచ భద్రతకు ప్రమాదకరమైన ముప్పు.’’
(2) ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలకు: ‘‘తక్షణమే అన్ని రకాల సహాయాలు, ఋణాలు, ఇతరత్రా సహకారమూ అందించడం నిలిపివేయండి. ఆ నిధులను ఒక పద్ధతి ప్రకారం ఉగ్రవాదాన్ని మళ్ళిస్తున్నారు. దేశ అంతర్గత అసంతృప్తులను అణచివేస్తున్నారు పొరుగు దేశాలను అస్థిరపరుస్తున్నారు.’’
(3) ప్రపంచంలోని ప్రజజస్వామిక దేశాలకు: ‘‘పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న సింధీలు, బలోచ్‌లు, పష్తూన్‌లు, సరైకీలు తమ చారిత్రక సార్వభౌమత్వాన్ని కోరుకుంటున్నారు. స్వేచ్ఛ, శాంతి కావాలనుకుంటున్నారు. పాక్ అణచివేస్తున్న ఆ దేశాలకు స్వయం నిర్ణయాధికారానికి ఉన్న హక్కును గుర్తించండి.’’
(4) ఆ లేఖ ఒక ప్రతిపాదన కూడా చేసింది. పాకిస్తాన్ అణచివేతకు గురవుతున్న ప్రదేశాలన్నీ ఒక ప్రాంతీయ కేంద్రంగా ఏర్పడాలి. ఆ కేంద్రానికి భారత్ నాయకత్వం వహించాలి. చారిత్రక, నాగరిక సంబంధాల కారణంగా భారత్ నాయకత్వాన్ని అందరూ అంగీకరిస్తారు. ‘‘భాష, జాతి, సంస్కృతి ఆధారంగా స్వీయ నిర్ణయాధికారాన్ని ప్రకటించుకునే చట్టబద్ధమైన హక్కును పొందేందుకు మాకు మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సహితో పేర్కొన్నారు.
(సశేషం)