News

ఆపరేషన్‌ సిందూర్‌.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

61views

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాక్‌స్థాన్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’, ఇరుదేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం (India-Pak ceasefire) తర్వాత ప్రధాని మొదటిసారిగా సోమవారం రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు(Modi address to Nation). పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, పాక్‌తో కాల్పుల విరమణకు అంగీకారం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని ప్రసంగం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26మంది మృతిచెందిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్‌’తో పేరిట భారత సైన్యం పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయగా.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత మే 8, 9, 10 తేదీల్లో పాకిస్థాన్‌.. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌లు, క్షిపణి దాడులకు విఫలయత్నం చేయగా.. దాయాది కుట్రలను భారత సైన్యం వీరోచితంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో 35 నుంచి 40మంది పాక్‌ సైనికుల్ని మట్టుబెట్టింది.

ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. యుద్ధ వాతావరణం నెలకొనడంతో అమెరికా సహా పలు దేశాలు భారత్‌- పాక్‌ నడుమ మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాయి. ఇందులో భాగంగా సరిహద్దుల్లో కాల్పుల నిలిపివేతకు ఇరు దేశాలూ అంగీకరించడంతో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ ఒప్పందం, అనంతర పరిస్థితిపై ఇరుదేశాల మధ్య సోమవారం మధ్యాహ్నమే ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ (డీజీఎంవో)ల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. తాజాగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతమైనట్లు రక్షణశాఖ అధికారులు ప్రకటించిన వేళ మోదీ ప్రసంగం ప్రకటన వెలువడటం గమనార్హం.