News

ఉగ్రవాదుల కొత్త పన్నాగాలు గుహలు.. ఇప్పుడు బంకర్లు:.

34views

భద్రతా బలగాలకు చిక్కకుండా ఉగ్రవాదులు కొత్తకొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఉగ్రదాడులకు ముందు వారు దాక్కొనేందుకు గుహలకు బదులుగా బంకర్లను వాడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు విస్తుపోయే విషయాలను గుర్తించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

ఉగ్రవాదులు తాము నక్కే ప్రదేశాల విషయంలో మార్పులు చేసుకుంటున్నారు. తమ హైడవుట్స్‌గా గతంలో గుహలను ఉపయోగించుకున్న ఆ మూకలు.. అండర్‌గ్రౌండ్‌ బంకర్లను వాడుతున్నారు. గతేడాది కశ్మీర్ లోయలోని కుల్గామ్‌ అడవుల్లో నిర్వహించిన సెర్చ్‌ అండ్ కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు ఈ విషయాన్ని గుర్తించాయి. అవన్నీ తాత్కాలిక నిర్మాణాలు. భూమిని తవ్వి, దుంగలతో వాటిని నిర్మించుకున్నారు. చత్రు ప్రాంతంలో 12 వేల అడుగుల ఎత్తులో ఈ ఏడాది ప్రారంభంలో కూడా అలాంటి బంకర్ ఒకటి భద్రతా సిబ్బంది కంటపడింది. ఒకేసారి నలుగురు ఉండేంత విశాలంగా అది ఉంది. కొన్ని నెలల పాటు సరిపడా నిత్యావసరాలను అందులో నిల్వ చేసుకున్నట్లు బలగాలు వెల్లడించాయి.

ఉగ్రవాదులు గుహలు, తాత్కాలిక బంకర్లకే పరిమితం కాకుండా దట్టమైన అడవుల్లో ఎక్కువ కాలం మన్నిక ఉండే పక్కా బంకర్లను నిర్మిస్తున్నారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఎక్కువకాలం అజ్ఞాతంలో ఉండేందుకు వీలుగా, ఆశ్రయం కోసం స్థానికుల మీద ఆధారపడకుండా ఉండేలా అవి ఉపయోగపడనున్నాయి. ఉగ్రవాదులు నక్కారనే ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మే 22 నుంచి సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఆపరేషన్ షెరువాలీ పేరిట రాజౌరీలోని అటవీ ప్రాంతంలో గాలింపుచర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో ఉగ్రమూకలకు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఉగ్రవాదులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. రాజౌరీలోని గంబీర్ ముగ్లన్‌, డొరిమల్ ప్రాంతంలో ఉన్న హైడవుట్‌లో ఆశ్రయం పొందుతూ ఉండొచ్చని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా సకల సౌకర్యాలతో ఉన్న కాంక్రీట్ బంకర్‌ను గుర్తించి దానిని పేల్చివేశారు. ఈ అటవీ ప్రాంతంలో అలాంటివి మరికొన్ని ఉండొచ్చని అనుమానిస్తోన్న సిబ్బంది.. వాటికోసం గాలింపు కొనసాగిస్తున్నారు.