News

భారత్ ముందు నిలబడలేం.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన!

71views

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారిందని, అంతర్జాతీయంగా భారత్ ముందు నిలబడలేమని నజామ్ సేథి అభిప్రాయపడ్డారు. అరబ్ దేశాలు కూడా భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని ఆందోళన చెందారు. ఓ పాకిస్థాన్ టీవీ లైవ్ షోలో నజామ్ మాట్లాడుతూ.. “మన దేశం బలహీనంగా మారింది. ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ప్రయాణిస్తున్నాం. మన అంతర్గత పరిస్థితి కూడా దిగజారింది. అమెరికా మనకు చేయూతనందించేందుకు నిరాకరిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో సంబంధాలు బాగా లేవు.” అని నజామ్ సేథి వ్యాఖ్యానించారు.

భారతదేశం అంతర్గత పరిస్థితి కూడా బాగా లేదని, బంగ్లాదేశ్‌తో సంబంధాలు క్షీణించాయని యాంకర్ అడిగింది. నజామ్ సేథి యాంకర్ ప్రకటనను పూర్తిగా తిరస్కరించారు. “అంతర్జాతీయంగా భారత్ ఇప్పటికీ ఉనికిని కలిగి ఉంది. దురదృష్టవశాత్తు మనకు గుర్తింపులేదు. ప్రస్తుతం, విదేశీ పెట్టుబడులన్నీ భారతదేశానికే వెళ్తున్నాయి. అరబ్ ప్రపంచం భారత్‌కు మద్దతు ఇస్తుంది. సౌదీ అరేబియా, యూఏఈ బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశం ఏ మాత్రం ఒంటరి కాదు. కానీ.. పాకిస్థాన్ ఒంటరిగా మారింది. భారత్ ముందు బంగ్లాదేశ్‌ చాలా చిన్నది.” అని పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఆవేదన వ్యక్తం చేశారు.