
సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా… అంటూ తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాట పెద్ద వివాదమే ఏర్పడింది. ఉదయనిధిపై కేసుల నమోదు వరకు వెళ్లింది. కాగా… ఆ కేసు విచారణ ఆగస్టుకు వాయిదా పడింది.
సనాతనం గురించి వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిపై నమోదైన కేసు విచారణ ఆగస్టుకు వాయిదాపడింది. తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సంఘం ఆధ్వర్యంలో 2023లో నగరంలో నిర్వహించిన సనాతన నిర్మూలన మహానాడులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి సనాతనాన్ని డెంగ్యూ, మలేరియా మాదిరిగా నిర్మూలించాలి అంటూ ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కాగా, ఆయనపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో, తనకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులు రద్దు చేయాలని, కేసులన్నీ ఒకే కేసుగా విచారించేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ ఉదయనిధి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఈ క్రమంలో, ఈ కేసు బుధవారం విచారణకు రాగా, తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదావేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.