
భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యానికి ఎంతమాత్రం సాయం చెయ్యవద్దని పాకిస్తాన్‌లోని పస్తూన్ తెగల ప్రజలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నది జిహాద్ కానే కాదని, వీళ్లు దొంగలు అని తాలిబన్లు తిట్టిపోశారు. పాకిస్తాన్ ఆర్మీ ఆటలో మనం పావులం కావద్దని సూచన చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ పరిణామాలపై ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందిస్తూ భారత్ – పాక్‌లు సంయమనం పాటించి చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని ఎక్స్ అకౌంట్ ద్వారా కోరింది.
పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య కొన్నేళ్ళుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాలిబన్లు పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. ఒకవైపు భారత్‌లో పాకిస్తాన్ చేస్తున్నది కూడా ఇదే పని అయినప్పటికీ తన దాకా వచ్చేసరికి గగ్గోలు పెడుతోంది. తాజాగా పాకిస్తాన్ నుంచి వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులను దేశం విడిచిపోవాలని ఆదేశించడమే గాక వెంటాడి మరీ పంపించింది. రెండు దేశాల మధ్యా నీటి పంపకం సమస్యలు కూడా ఉన్నాయి. రెండు దేశాల సరిహద్దుగా ఉన్న డ్యూరాండ్ రేఖ బాంబు దాడులు, గగనతల దాడులు, వీధి పోరాటాలతో దద్దరిల్లిపోతోంది.
పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా, ఉత్తర బెలుచిస్తాన్ సహా పలు గిరిజన ప్రాంతాల్లో పస్తూన్ జాతి ప్రజల సంఖ్య చాలా ఎక్కువ. చారిత్రకంగా వీరంతా ఆఫ్ఘనిస్తాన్‌తో బలమైన వారసత్వ సంబంధాలు గలవారు. వీరిపై తాలిబన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆఫ్ఘన్ మాజీ ప్రధాని హమిద్ కర్జాయ్ గతంలో పాకిస్తాన్‌ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా తిట్టిపోశారు. మరోవైపు టీటీపీ (తెహ్రీక్ ఎ తాలిబన్ ఎ పాకిస్తాన్) ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్‌లో వేళ్ళూనుకుని ఈ దేశాన్ని నానా తిప్పలు పెడుతోంది. 2022లో కాబూల్‌లోని పాక్ రాయబార కార్యాలయంపై దాడులు జరిగాయి. ఈ రకంగా రెండు దేశాల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.





