
హిందూ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేయడంతో పాటు హిందూ దేవాలయాలను పరిరక్షించడమే విశ్వ హిందు పరిషత్ ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. శనివారం విశ్వహిందు పరిషత్ జాతీయ ట్రస్టీ పుట్ట గుంట సతీష్ కుమార్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని తన ఫామ్ హౌస్లో ఆశా జ్యోతి ఆశ్రమ పాఠశాల దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఉపకరణాలు, దుస్తులను పంపిణీ చేశారు. అలోక్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలోక్ మార్ మాట్లాడారు. హిందు మతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. వంద దేశాల్లో మత ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే కులమతాలకు అతీతంగా విశ్వ హిందు పరిషత్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందన్నారు. హిందూ మత ధర్మాన్ని మరింత విస్తృతం చేయడానికి అయోధ్యలో రామమందిర్ నిర్మాణం దోహద పడుతుందన్నారు. రామమందిరం నిర్మాణం విశ్వహిందు పరిషత్ సాధించిన గొప్ప విజయమన్నారు. కశ్మీర్‌లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని హిందూ మతంపై దాడిగానే గుర్తిస్తున్నామని, మతం అడిగి నిర్ధారించుకున్న తర్వాతే కాల్పులు జరపడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో అన్నిమతాల వారు స్వేచ్ఛగా జీవిస్తూ తమకు ఇష్టమైన భగవంతుడ్ని ఆరాధించుకునే అవకాశం ఉందని, కానీ బలవంతపు మత మార్పిడిలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. కొంతమంది మతోన్మాదులు మత కలహాలు, కాల్పులకు పాల్పడటం ఘోరమని, ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం గుణపాఠం చెబుతుందని పేర్కొన్నారు. భారతదేశం ఒక హిందు దేశం, ఒక కులానికి మతానికి చెందినది కాదన్నారు. కాశ్మీర్ ఉగ్రవాదులు జరిపిన దాడులు పూర్తిగా మత పరమైనవన్నారు.
విశ్వహిందు పరిషత్ తెలంగాణా, ఆంధ్రరాష్ట్రాల అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ విశ్వహిందు పరిషత్ ఒక ధార్మిక సామాజిక సంస్థ, ధర్మం కోసం హైందవ శంఖారావం నిర్వహించిందన్నారు. సమాజం కోసం లక్ష ఏకోపాధ్యాయ పాఠశాలలు, అనాధ శరణాలయాలు, హాస్టల్స్, గోశాలలు నిర్వహిస్తోందన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు అర్చకులకు ప్రత్యేక శిక్షణాలయాలను నిర్వహిస్తుంద న్నారు. సమాజాన్ని సమరసత మార్గంలో నడిపించడానికి పరిషత్ కృతని శ్చయంతో పని చేస్తోందన్నారు. వీహెచ్పీ రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్, నాయకులు శ్రీనివాసరాజు ఉన్నారు.




