News

భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రి ‘ఎక్స్‌’ ఖాతా నిలిపివేత

284views

పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్‌ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఖాతాను ఓపెన్‌ చేసిన వారికి ఒక సందేశం దర్శనమిస్తోంది. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోంది. పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి ఖాతాను బ్లాక్‌ చేసింది.

పహల్గాం దాడి తర్వాత పాక్‌ రక్షణమంత్రి పలుమార్లు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచి పోషించడంపై మీ స్పందన ఏంటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ‘‘అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్‌ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేది’’ అని అన్నారు. అలా చెప్తూనే.. లష్కరే తోయిబా ఉనికి ఇప్పుడు తమ దేశంలో లేదన్నారు.

అలాగే మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇప్పుడు అది (ప్రతీకార దాడి) జరగనున్న విషయం కాబట్టి.. మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడులు జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నాం’’ అని మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.