News

జూన్‌ నుంచి కైలాస్‌- మానసరోవర్‌ యాత్ర

291views

ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస్‌- మానసరోవర్‌ యాత్రను ఈ ఏడాది జూన్‌ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్‌ నుంచి ఆగస్టు వరకూ కొనసాగనున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. ‘50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలు ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌ పాస్‌ నుంచి, 10 బృందాలు సిక్కిం నాథులా పాస్‌ నుంచి ఈ యాత్రకు తరలి వెళ్తాయి’ అని వెల్లడించింది. యాత్ర కోసం దరఖాస్తులను kmy.gov.inలో సమర్పించవచ్చని, కంప్యూటర్‌ జనరేటెడ్‌ విధానం ఆధారంగా యాత్రికులను ఎంపిక చేస్తామని పేర్కొంది. కొవిడ్‌ కారణంగా కైలాస పర్వతం, మానసరోవర్‌ సరస్సు యాత్ర 2020లో ఆగిపోయింది. ఆ తర్వాత గల్వాన్‌ ఘర్షణల కారణంగా భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. గతేడాది రష్యాలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీ అనంతరం ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తెెచ్చే చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కైలాస్‌- మానసరోవర్‌ యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నారు.