News

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

1.2kviews

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి సంబంధించిన దస్త్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. అంతకు ముందు రాష్ట్రపతి పాలన విధించే అంశానికి కేంద్ర కేబినెట్‌ ప్రతిపాదించింది. ఎన్సీపీ మరింత గడువు కోరడంతో రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చిన గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ.. రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారుసు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో, కేంద్ర కేబినెట్‌ సిఫారసు, మహారాష్ట్ర గవర్నర్‌ నివేదిక ప్రస్తుతం రాష్ట్రపతి వద్దకు చేరాయి.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను, అవకాశాలను పరిశీలనలోకి తీసుకొని ఎక్కడా అవకాశాలు కనబడలేదని గవర్నర్‌ పేర్కొన్నారు. అలాగే, అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన తప్ప మరో అవకాశం లేదని నివేదికలో తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తప్పనిసరి. అందువల్ల గవర్నర్‌ కార్యాలయం ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర కేబినెట్‌ భేటీ అయి దీనిపై తీర్మానం చేసింది. కేంద్ర కేబినెట్‌ తీర్మానం ప్రతి, గవర్నర్‌ పంపిన నివేదిక ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌కు చేరాయి. పంజాబ్‌ పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్‌ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ సిఫారసు, కేంద్ర కేబినెట్‌ తీర్మానంపై రాష్ట్రపతి సంతకం పెట్టడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన అమలులోకి వచ్చినట్టయింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.